గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్‌సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు..
‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి.
మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన.
Comments
Please login to add a commentAdd a comment