జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోస్టు పెట్టాడని..!
ఇప్పాల రవీందర్‌పై తాడిపత్రిలో కేసు నమోదు
తాడిపత్రి: సోషల్ మీడియా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై చంద్రబాబు సర్కారు కన్నెర్ర జేస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేసిన వారిని వెంటాడి వేధిస్తోంది. తాజాగా మరో సోషల్ మీడియా కార్యకర్త ఇప్పాల రవీందర్‌పై సర్కారు ఇదేతరహాలో బెదిరింపుల పర్వానికి తెరలేపింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుమతి పోస్టు పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ జెడ్పీటీసీ సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఈ క్రమంలో విశాఖ జైలులో ఉన్న రవీందర్‌ను పీటీవారెంట్‌పై పోలీసులు తాడిపత్రికి తరలించారు. మరికాసేపట్లో తాడిపత్రి కోర్టు ముందు ఆయనను ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
కాగా, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తాడిపత్రిలో ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ పెద్దసంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు.. గతంలో ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే విశాఖ పోలీసులు ఈ నెల 17న ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విశాఖ పోలీసులు బెంగుళూరు రామకృష్ణనగర్‌లోని రవీంద్ర ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు.