
విమాన సర్వీసుల నియంత్రణ!
నేవీ ఫ్లీట్ నేపథ్యంలో అధికారుల ముందు జాగ్రత్త
నిర్ణీత తేదీలు.. వేళల్లో విమాన సర్వీసుల రద్దు
{పముఖులు, విదేశీ విమానాలకు అంతరాయం లేకుండా చర్యలు
దేశీయ విమాన సర్వీసుల రూటు మళ్లింపు
గోపాలపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు అత్యంత ప్రముఖులను తీసుకొచ్చే దేశ, విదేశీ విమానాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని విశాఖ విమానాశ్రయలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్ణీత తేదీల్లో కొన్ని సమయాల్లో విమానాశ్రయాన్ని మూసివేయాల్సి ఉంటుందని అంటున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీతోపాటు యాభై దేశాల నుంచి మంత్రులు, నేవీ ఉన్నతాధికారులు రానుండటంతో తూర్పు నావికాదళంతోపాటు ఎస్పీజీ తదితర భద్రతాధికారులు గత రెండు రోజులుగా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ముందస్తు భద్రతా ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నేవీ ఫ్లీట్‌కు విమానాలు రాకపోకలు సాగించే సమయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల వల్ల అంతరాయం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఆ మేరకు విశాఖ విమానాశ్రయాన్ని బుధవారం నుంచి ఆయా రోజుల్లో కొన్ని గంటలపాటు మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుత విమానాశ్రయ రన్‌వేతో పాటు పాత విమానాశ్రయ కార్గో రన్‌వే, ఐఎన్‌ఎస్ డేగా రన్‌వేలను కూడా ప్లీట్‌రివ్యూ సందర్భంగా వినియోగించాలని నిర్ణయించారు. ప్లీట్‌కు వచ్చే విదేశీ విమానాలకు సముద్రం మీదుగా రూట్ ఇచ్చి, దొమస్టిక్ విమాన సర్వీసులను సింహాచలం కొండ ప్రాంతం ప్రామాణికంగా రాకపోకలు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే నేవీ అధికారులు విమాన సంస్ధలకు సూచనలిచ్చినట్లు తెలిసింది. దీనిపై తమకు వర్తమానం అందిందని భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. భద్రతా కారణాల వల్ల అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మూసివేసే తేదీలు.. వేళలు..
విశ్వసనీయ సమచారం ప్రకారం విమానాశ్రయాన్ని మూసివేసే వేళలు తేదీల వారీగా ఇలా ఉన్నాయి.. ఈ నెల 27(బుధవారం) నుంచి 29 వరకు.. తిరిగి ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు.. ఈనెల 30, 31, ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విమాన సర్వీసులు ఉండవని తెలిసింది.