మాస్కులు లేకుండా స్కూటర్‌పై తిరుగుతున్న యువకులు
కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా పేదవాడి ఆకలి కేకలను.. సగటు జీవి అర్ధాకలిని.. రోజువారి, చిన్నచితకా వ్యాపారులు, దినసరి కూలీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించాయి. మరోవైపు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించాయి. అయితే లాక్‌డౌన్ సడలించగానే కరోనా వైరస్ పోయిందన్నట్లు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాసు్కలు ధరించకుండా, శానిటైజర్ పూసుకోకుండా, రోడ్లపైనే ఇష్టారీతిన తిరుగుతున్నారు. ఇక భౌతికదూరం పాటించేవారే కరువయ్యారు. దీంతో కరోనా రక్కసి తరుముకొస్తోంది. జిల్లావ్యాప్తంగా చూస్తే గత కొన్నిరోజులుగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికైనా జనం స్వీయ జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు కరోనాను నియంత్రించవచ్చు. లేదంటే మాత్రం భారీ మూల్యం చెల్లించకతప్పదని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాక్షి, తిరుపతి: గత వారం రోజులుగా జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటికైనా జనం కనీసం జాగ్రత్తలు పాటించకపోతే జూలై 10 నాటికి జిల్లాలో 1500 పైగా కరోనా కేసులు దాటే అవకాశం ఉందని అధికారం యంత్రాంగం చెబుతోంది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 86 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 782కి చేరింది. అందులో 388 మంది డిశ్చార్జ్ కాగా, 389 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ తీవ్రం కావడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను విధించినా.. జనం పట్టించుకోవడం లేదు.
తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీలు, రేణిగుంట, చంద్రగిరి, కు ప్పంతో పాటు మరికొన్ని రద్దీ ప్రాంతాల్లో జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. తిరుపతి నగరంలో అయితే ఉదయం, సాయంత్రం రహదారులపై వాహనాలపై వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. చాలామంది మాస్‌్కలు వినియోగించడం లేదు. అనేకచోట్ల శానిటైజర్లు వాడడం లేదు. జిల్లావ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు ఒక్క తిరుపతి అర్బన్‌లో అత్యధికంగా 128 కేసులు నమోదవగా.. శ్రీకాళహస్తిలో 119, పుత్తూరులో 61 కేసులు నమోదయ్యాయి. చదవండి: భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
కొంప ముంచుతున్న నిర్లక్ష్యం..
మొదట విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్ రాగా.. అతని కారణంగా ఎవరికీ వైరస్ సోకలేదు. ఆ తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కేసులు నమోదయ్యాయి. శ్రీకాళహస్తిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు గుంటూరుకు వెళ్లి రావడంతో పాజిటివ్ వచ్చింది. అతని నిర్లక్ష్యం కారణంగా మరింత మందికి వైరస్ సోకింది. అందులో ఒకరు మృతి చెందారు. చెన్నై కోయంబేడు రూపంలో వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ పచ్చని పల్లెలకు పాకింది. నాగలాపురం, పిచ్చాటూరు, సత్యవేడు, పుత్తూరు, నారాయణవనం, కార్వేటినగరం, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, మదనపల్లి, తిరుపతి పట్టణాల్లో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. వారం రోజులుగా చూస్తే మారుమూల గ్రామాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
మొదట కోయంబేడుకు కూరగాయలు తీసుకెళ్లే డ్రైవర్‌కి వచ్చింది. అతని ద్వారా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. కోయంబేడుకు వెళ్లి వచ్చిన ఓ వ్యాపారికి పాజిటివ్ వస్తే.. అతని ద్వారా మరో నలుగురికి సోకింది. నాగలాపురం పరిధిలో పదిమంది కోయంబేడుకు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే.. వారి ద్వారా 30 మందికి వైరస్ సోకింది. పుత్తూరు పరిధిలోని వేపగుంట, తిరుమలకుప్పం, రామసముద్రంకు చెందిన ముంబై, చెన్నైలో కూలీలుగా పనిచేస్తున్న వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. అదే విధంగా ఓ ఏసీ మెకానిక్, ఇద్దరు పోలీసు అధికారులకు పాజిటివ్ వచ్చింది. వీరి ద్వారా వారి కుటుంబీకులకు సోకింది. పుత్తూరుకు చెందిన ఓ వ్యాపారి చెన్నైకి వెళ్లి వచ్చాడు. అతనికి వైరస్ సోకడం, ఆ విషయం అతను గ్రహించకుండా పట్టణంలో విచ్చలవిడిగా తిరిగాడు. చివరికి ఆ వ్యాపారి మరణించాడు. అతని ద్వారా కొంతమందికి పాజిటివ్ వచ్చింది.
తిరుపతి నగరంలో అధికం..
నగరంలో అరటి పండ్ల వ్యాపారి ద్వారా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఆ మహిళ ద్వారా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. వారి ద్వారా మరికొందరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. తిరుపతి రూరల్ పరిధిలో కొందరి నిర్లక్ష్యం కారణంగా వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా జనం నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పోలీసులు, వైద్యులు హెచ్చరిస్తున్నా జనం అవేమీ పట్టించుకోవడం లేదు. చాపకింద నీరులా పాకుతున్న వైరస్‌ని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాల్సి ఉంది. లేదంటే మరింత ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment