గుంటూరు, కర్లపాలెం: కర్లపాలెం మండల పరిధిలోని ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వీరితో సన్నిహితంగా ఉన్న మరో 14 మందిని అధికారులు తెనాలి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. గతంలో శ్రీరామ్‌నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వ్యాధి సోకడంతో విజయవాడ క్వారంటైన్ కేంద్రంలో ఉండి వ్యాధి నయమైన తరువాత ఇటీవల తిరిగి తన ఇంటికి వచ్చాడు. మరళా తల్లి ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ రావడంతో కర్లపాలెం మండలంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎస్‌కె సుహానా బేగం తెలిపిన వివరాల మేరకు.. బుద్ధాం గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మద్రాసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో అక్కడే అతనితో కలసి ఉంటుంది.
ఆమె భర్తకు కరోనా వ్యాధి సోకడంతో అతనిని స్థానిక అధికారులు క్వారంటైన్‌కు పంపి వైద్య సేవలందిస్తున్నారు. ఈనేపథ్యంలో సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి ఈనెల 22న నెల్లూరు వరకు ఒక వాహనంలో అక్కడి నుంచి తమ బంధువుల కారులో గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్న తమ బంధువుల ఇంటికి వచ్చింది. ఆమెకు ఆరోగ్యం బాగుండకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలసి ఈనెల 23న చీరాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో అక్కడి అధికారులు వారిని ఒంగోలులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించి ఆమెతో పాటు ఉన్న తల్లిని చీరాల క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. మహిళతో సన్నిహితంగా ఉన్న బుద్ధాం, పెదగొల్లపాలెం గ్రామాలకు చెందిన తన అన్నదమ్ముల కుటుంబ సభ్యులను, నెల్లూరు నుంచి బాపట్ల తీసుకొచ్చిన కారు డ్రైవర్‌తో సహా మొత్తం 14 మందిని తెనాలి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు డాక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment