ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తున్న వైద్య సిబ్బంది
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే నగరంలో 30 వరకు కరోనా కేసులు నమోదుకాగా, తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని వార్డు సచివాలయాల కార్యదర్శులు, వార్డు వలంటీర్లు, పారిశుధ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఆదివారం సామూహికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వారిలో తొలిరోజు 744 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. ఒంగోలులోని బాలాజీనగర్, మంగమూరురోడ్డు, పాపాకాలనీ, వెంకటేశ్వర కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. బాలాజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఒక వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఒక మహిళకు, పాపా కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మహిళా వార్డు వలంటీర్‌కు కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. ర్యాపిడ్ కిట్ ద్వారా పరీక్షించగా, ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. అయితే వారికి స్వాబ్ ద్వారా మరోసారి పరీక్షించి కరోనాను నిర్ధారించనున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన మహిళా పోలీసును రిమ్స్‌లోని ఐసోలేషన్‌కు తరలించగా, మహిళా వార్డు వలంటీర్ మాత్రం తాను ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టడంతో ఆమెను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు.
ఇద్దరు రేషన్ డీలర్లకు..
ఒంగోలు నగరంలోని కమ్మపాలేనికి చెందిన ఇద్దరు రేషన్ డీలర్లకు కరోనా ఉన్నట్లు ర్యాపిడ్ పరీక్షల్లో తేలింది. వారికి కూడా స్వాబ్ ద్వారా మరోసారి పరీక్షించనున్నారు. దాంతో ఆ డీలర్లను ఐసోలేషన్‌కు, వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ ఇద్దరు రేషన్ డీలర్లలో ఒక వ్యక్తి రేషన్ సరుకులు అతి సమీపంగా ఇవ్వడం, శనగలను కూడా అదే మాదిరిగా ఇవ్వడంతో వాటిని తీసుకున్నవారు భయపడిపోతున్నారు.
56కు చేరుకున్న కోవిడ్ కేసులు
ఒంగోలు సెంట్రల్: జిల్లాలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు 56కు చేరుకున్నాయి. ఆదివారం జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుడ్లూరులో మూడు, ఒంగోలు ఇస్లాంపేటలో ఒకటి నమోదైంది. దీంతో వీరికి దగ్గరగా ఉన్న వారిని జీజీహెచ్ క్వారంటైన్‌కు తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారు అనే విషయంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 8453 శాంపిల్స్‌ను కోవిడ్ 19 అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి సేకరించి, పరీక్షలకు పంపించారు. వీటికి సంబంధించిన నివేదికలు ఇప్పటి వరకూ 4641 జిల్లాకు అందాయి. వీటిలో 4585 శాంపిల్స్‌ను నెగిటివ్‌గా నిర్ధారించారు. మరో 3813 మంది నివేదికలు జిల్లాకు అందాల్సి ఉంది.
జిల్లాకు అదనంగా ఆర్‌టీ పీసీఆర్ యంత్రాలు
జిల్లాలో కోవిడ్ 19 వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 7 యంత్రాలను జిల్లాకు మంజూరు చేసింది. ప్రస్తుతం 17 ఆర్‌టీపీసీఆర్ యంత్రాలు పని చేస్తున్నాయి. మూడు షిఫ్టుల్లో శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment