సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విజయం సాధించింది. మహమ్మారిని జిల్లా నుంచి పారద్రోలే క్రతువులో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల పాత్ర అభినందనీయం. మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న ప్రకాశం నేడు ఒకే ఒక్క పాజిటివ్ కేసుతో రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక జిల్లాల్లో ఇప్పటికీ పాజిటివ్ కేసులు అధి సంఖ్యలో నమోదవుతుండగా ఇక్కడ పాజిటివ్‌గా నమోదైన వారంతా కోలుకోవడంతో పాటు గత వారం రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనించదగ్గ విషయం. జిల్లాలో నమోదైన 60 పాజిటివ్ కేసుల్లో తాజాగా గురువారం డిశ్చార్జి అయిన 8 మందితో కలిపి మొత్తం 59 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా ఒక్కరు మాత్రమే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయడంతో జిల్లా లో వైరస్‌ను వేగంగా నియంత్రించగలిగారు.
కాంటాక్ట్ గుర్తింపులో వేగం..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబితాలో ప్రకాశం జిల్లా ఆరెంజ్ జోన్‌లో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలానే కొనసాగితే త్వరలో జిల్లా గ్రీన్ జోన్‌గా మారే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. జిల్లాలో పాజిటివ్ కేసు నమోదైన వెంటనే వారి కాంటాక్ట్స్‌ను గుర్తించడం, క్వారంటైన్‌కు వారిని తరలించడంలో అధికార యంత్రాంగం చొరవ ప్రశంసనీయం. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సైతం జిల్లాలో ప్రజలకు చేయూతనిస్తూ నిత్యావసర సరుకులు, మాస్క్‌లు, శానిటైజర్ల వంటి వాటిని అందించడంలో ముందున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే లాక్‌డౌన్ సైతం జిల్లాలో పకడ్బందీగా అమలు చేశారు. లాక్‌డౌన్ విధుల్లో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేలా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆర్టీసీ ఉద్యోగుల, హాస్టల్ వెల్ఫేర్ అధికారుల వంటి అనేక విభాగాల నుంచి వారికి తోడుగా విధులను కేటాయించడంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు నిత్యావసర సరుకులకు, కూరగాయలకు ఇబ్బందులు పడకుండా రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లు చేసి రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా జిల్లాలో 554 గ్రామాల్లో 64,999 కుటుంబాలకు నేరుగా తక్కువ ధరకు కూరగాయలు, పండ్లు అందించడంతో కష్టకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలిగారు. జనతా బజార్ల ద్వారా రైతుల నుంచి కూరగాయలు, పండ్లు నేరుగా కొనుగోలు చేయడంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర సైతం అందినట్‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో సైతం మూడు రోజుల క్రితమే మద్యం షాపులు తెరుచుకున్నప్పటికీ జిల్లాలో ఒక మద్యం దుకాణం కూడా తెరుచుకోకపోవడం మేలు చేసే అంశంగా చెప్పవచ్చు.
ఒకే ఒక్క పాజిటివ్ కేసు
జిల్లాలో గత 45 రోజుల్లో 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటి వరకు 59 మంది కరోనా మహమ్మారిని జయించి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు చేరారు. ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్‌లో ఒకే ఒక్క వ్యక్తి కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్నాడు. దీనికి తోడు వారం రోజులుగా జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం శుభపరిణామం. పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులను ఒంగోలు జీజీహెచ్‌తో పాటు కిమ్స్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. దీంతో పాజిటివ్ ఉన్న ఏ ఒక్క వ్యక్తికి ప్రాణాపాయం లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూ వచ్చారు. ఏప్రిల్ 3వ తేదీన లండన్ నుంచి వచ్చిన యువకుడు కరోనాను జయించి మొట్టమొదటిగా డిశ్చార్జి కాగా, అదే నెల 24వ తేదీన 11 మంది, 25వ తేదీన 11 మంది, 28వ తేదీన ఇద్దరు, 29వ తేదీన 18 మంది, మే 2వ తేదీన ఆరుగురు, మే 5వ తేదీన ఒక్కరు డిశ్చార్జి అయ్యారు. తాజాగా గురువారం మరో 8 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు చేరారు. దీంతో ప్రకాశం జిల్లాలో కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నారు. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, వైద్యులు గత 45 రోజులుగా చేస్తున్న నిరంతర కృషిని, వారి పనితీరును వల్లే కరోనాను కట్టడి చేయగలిగారని జిల్లా ప్రజానీకం అభినందిస్తున్నారు.
అందరి సహకారం వల్లే సాధ్యమైంది..
జిల్లాలో కరోనా వ్యాప్తి నివారించేందుకు ఇన్సిడెంటల్ కమాండింగ్ సిస్టంను అవలంభించాం. దీని ద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశాం. వారికి క్షేత్రస్థాయిలో విధులు కేటాయించాం. పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించగలగటం, వారిని క్వారంటైన్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. లాక్‌డౌన్‌ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయడంలో విజయం సాధించగలిగాం. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల సరుకులు, కూరగాయలు, పండ్లు వంటివి అందించడంలో ఇబ్బందులు చేయకుండా సరఫరా చేయడంతో జిల్లా ప్రజల నుంచి పూర్తిగా సహకారం అందింది. రైతులకు సైతం ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా కూరగాయలు, పండ్లు సేకరించి నేరుగా వినియోగదారులకు పంపిణీ చేయడం వంటి విషయంలో జిల్లా ముందంజలో ఉంది. ఇలాంటి విపత్తు సమయంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, వైద్యులు సహకారం అందించిన తీరు మరువలేనిది. జిల్లాలోని ఇప్పటికే చీమకుర్తి, కారంచేడు, కందుకూరు కంటైన్మెంట్ జోన్లను 500 మీటర్ల పరిధికి పరిమితం చేశాం. మరికొద్ది రోజులపాటు ఇదేవిధంగా పనిచేసి కరోనా నుంచి జిల్లాను కాపాడుకునేందుకు అందరూ సహకారం అందించాలని కోరుతున్నాం. – పోల భాస్కర్, జిల్లా కలెక్టర్
బాధితుల సహకారం మరువలేనిది...
జిల్లాలో ఇప్పటి వరకు 60 మంది కరోనా వైరస్ సోకి ఒంగోలు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స నిమిత్తం వచ్చారు. పాజిటివ్ కేసులు నమోదైన 60 మందిలో 8 మంది మాత్రమే కరోనా అనుమానిత లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందులో ఇద్దరు న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మిగతా 52 మందికి కరోనా వైరస్ ఉన్నప్పటికీ వారిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవు. కరోనా బాధితులంతా వైద్య సిబ్బందితో ఫ్రెండ్లీగా మెలగడంతో పాటు రిపోర్ట్‌లు ఆలస్యమైనప్పటికీ మాకు పూర్తిగా సహకరించడం వల్లే ఇప్పటికి 59 మంది వైరస్ నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు. ఇంకా ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో సైతం వైద్య సిబ్బంది చూపిన తెగువ అభినందనీయం. – డాక్టర్ జాన్ రిచర్డ్స్, కోవిడ్–19 జిల్లా నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment