సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా చేస్తున్న పోరాటం సత్ఫలితాలనిస్తోంది. మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా నేడు 7వ స్థానానికి పడిపోయిందంటే జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికుల కష్టం ఎంతో ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ సోకిన వారంతా కోలుకుంటూ ఉండటంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో అధిక శాతం పాజిటివ్ కేసులు నమోదైన ఒంగోలు, చీరాల, కందుకూరు, కారంచేడు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పాజిటివ్ వ్యక్తులు ఒంగోలు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రిల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
వీరిలో మొదట్లో చేరిన 41 మంది కరోనా పాజిటివ్ బాధితుల్లో 37 మంది కరోనాను జయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి శాంపిల్స్‌ను పలుమార్లు పరీక్షల నిమిత్తం పంపగా నెగిటివ్ రిపోర్టులు రావడంతో వీరందరినీ శనివారం డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు సమాయత్తమవుతున్నారు. ఒకేరోజు 37 మందిని డిశ్చార్జ్ చేసిన జిల్లాగా రాష్ట్రంలోనే పేరొందే అవకాశముంది. కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు వారిని కంటికి రెప్పలా జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది కాపాడారని అధికారులు వారిని అభినందిస్తున్నారు. అంతేగాకుండా ఐసోలేషన్ వార్డు, క్వారంటైన్‌లలో చికిత్స పొందే వారికి మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రతిరోజు మానసిక వైద్య నిపుణులతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.
జిల్లాలో 52కు చేరిన పాజిటివ్ కేసులు
జిల్లాలో ఇప్పటి వరకూ 3022 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపగా అందులో 1236 రిపోర్ట్‌లు వచ్చాయి. ఇందులో 1184 మందికి నెగిటివ్ రాగా, 52 మందికి మాత్రం కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మరో 1782 మందికి సంబంధించిన రిపోర్ట్‌లు రావాల్సి ఉంది. అయితే వీరిలో మొట్టమొదట పాజిటివ్ కేసు అయిన యువకుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో 37 మందిని నేడు డిశ్చార్జి చేసేందుకు వైద్యులు సమాయత్తమవుతున్నారు. పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా వేగంగా కోలుకుంటున్నట్లు కోవిడ్–19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ తెలిపారు.
సోమవారం నుంచి జీజీహెచ్‌లోనే కరోనా పరీక్షలు
జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇరుగు పొరుగు నివాసముంటున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో సేకరించిన శాంపిల్స్‌ను ఇప్పటి వరకు గుంటూరు, విజయవాడ ల్యాబ్‌లకు పరీక్షలకు పంపి నివేదికల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయని గుర్తించిన కలెక్టర్ పోల భాస్కర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒంగోలు జీజీహెచ్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. శనివారం టెస్ట్ శాంపిల్స్‌ను తీసి సోమవారం నుంచి ఒంగోలు జీజీహెచ్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకు విడివిడిగా అయితే 90 మందికి పరీక్షలు నిర్వహించే వీలుండగా, శాంపిల్ పూలింగ్ ద్వారా ఐదు మందివి ఒకేసారి పరీక్షిస్తే 450 మంది శ్యాంపిల్స్ పరీక్షలు జరిపే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment