డైట్‌ కాంట్రాక్టర్‌ కక్కుర్తి.. | Diet Contractor Corrupt in Budget Prakasam GGH | Sakshi
Sakshi News home page

డైట్‌ కాంట్రాక్టర్‌ కక్కుర్తి..

Published Fri, Apr 24 2020 1:16 PM | Last Updated on Fri, Apr 24 2020 1:16 PM

Diet Contractor Corrupt in Budget Prakasam GGH - Sakshi

డైట్‌ కాంట్రాక్టర్‌ కక్కుర్తి.. కరోనా పాజిటివ్‌ బాధితులు, అనుమానితులకు ప్రాణ సంకటంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రోగులకు ఆహారం ఇవ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఆస్పత్రుల్లో సాధారణ రోగి భోజనానికి రూ.40 వెచ్చిస్తున్న ప్రభుత్వం.. కరోనా బాధితులు,అనుమానితులకు మాత్రం ఒక్కొక్కరికి రూ.100 ఖర్చు చేస్తోంది. నిపుణులైనడైటీషియన్లు సూచన మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక మెనూ అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఒంగోలు జీజీహెచ్‌ డైట్‌ కాంట్రాక్టర్‌ మాత్రం కరోనాబాధితులు, అనుమానితులకు సరైన పోషకాహారం ఇవ్వకుండా నిధులు మింగేస్తున్నాడు. ఇతని తీరుతో రోగులు, వారి బంధువులు విసిగి వేసారి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.     

ఒంగోలు సెంట్రల్‌:  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది ఒంగోలు జీజీహెచ్‌లో పరిస్థితి. కరోనా బాధితులకు మంచి ఆహారం అందించాలంటూ ప్రభుత్వం మామూలుగా ఇచ్చేదానికంటే రెండున్నర రెట్లు అదనంగా నిధులిస్తున్నా ఒంగోలు జీజీహెచ్‌లో డైట్‌ కాంట్రాక్టర్‌ మాత్రం రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. జీజీహెచ్‌లో శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ నుంచి డైట్‌ కాంట్రాక్ట్‌ వరకు ప్రతిదీ ఇదే కాంట్రాక్టర్‌ కనుసన్నల్లో నడుస్తున్నాయి. శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ వేరే వ్యక్తులు పొందినప్పటికీ సబ్‌ కాంట్రాక్ట్‌ మాత్రం ఇతనే నిర్వహిస్తున్నాడు.  ఏళ్ల తరబడి జీజీహెచ్‌లో అన్ని కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తున్న ఇతను ఆస్పత్రి అధికారులను నయానో, భయానో లొంగదీసుకుని దందా కొనసాగిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండతో రోగులకు సరైన భోజనం పెట్టకుండా లక్షల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒంగోలు జీజీహెచ్‌లోని సాధారణ రోగులతోపాటు, క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న రోగులకు పౌష్టికాహారం అందించాల్సిన డైట్‌ కాంట్రాక్టర్‌.. నాసిరకమైన ఆహారాన్ని పెడుతుండటంతో రోగులు ఇటీవల ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా అతని తీరు మాత్రం మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కాంట్రాక్టర్‌ తీరుపై రోగుల ఫిర్యాదు
క్వారంటైన్‌లో ఉన్న వారికి పోషకాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచి, ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒంగోలు జీజీహెచ్‌లో కోవిడ్‌ 19 రోగులకు కాంట్రాక్టర్‌ పోషకాహారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. జీజీహెచ్‌లోని కోవిడ్‌ 19 వార్డులో ఉండే రోగులు తమకు అందించే డైట్‌ నాణ్యంగా లేదని అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. జీజీహెచ్‌లో సాధారణ రోగులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.40 చెల్లిస్తోంది. అయితే కోవిడ్‌–19 రోగులకు ప్రత్యేక పోషకాహారం అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో రోజుకు రూ.100 చెల్లిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్‌ కక్కుర్తితో పోషకాహారం అందించకుండా నిధులు కాజేస్తున్నాడు. జీజీహెచ్‌లో దాదాపు 120 నుంచి 150 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. వీరిలో కరోనా పాజిటివ్‌ బాధితులు, క్వారన్‌టైన్‌లో ఉన్న వారు కలిపి 70 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక ఆహారం అందించాల్సిన బాధ్యత డైట్‌ కాంట్రాక్టర్‌పై ఉంది.ఈ విషయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కుడా మౌనం దాల్చడంతో రోగులకు పౌష్టికాహారం అందడం లేదు.   

ఆహారమే కీలకం
కరోనా సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి. ఒక వేళ కరోనా సోకితే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ తగిన మందులు తీసుకోవాలి. నిర్ధిష్టమైన మందు లేని కరోనా వైరస్‌ను జయించాలంటే ఆహారమే కీలకం. అధికంగా పోషకాలుండే ఆహారం తీసుకోకపోతే కరోనా కాటుకు బలి కావాల్సిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండే రోగులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది.  కరోనా వైరస్‌ సోకిన వారితోపాటు అనుమానితులను కుడా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తోంది. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కొవాలంటే రోగ నిరోధక శక్తి కీలకం కావడంతో వ్యాధిగ్రస్తులు, క్వారంటైన్‌లో ఉండే వారు త్వరగా కోలుకోవడానికి బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. నిపుణులైన డైటీషియన్ల సూచనల మేరకు రోగుల కోసం ప్రత్యేక మెనూనూ రూపొందించారు. ఈ మెనూ ప్రకారం భోజనంలో నారింజ, అరటి, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూర, లెమన్‌ వాటర్, ఉడకబెట్టిన గుడ్లు అందించాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగులు వైరస్‌తో పోరాడి త్వరగా కోలుకునేందుకు వీలుకలుగుతుంది. అయితే డైట్‌ కాంట్రాక్టర్‌ ధనార్జన రోగులపాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైట్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. డైట్‌ కాంట్రక్టార్‌ తీరుపై జాయింట్‌ కలెక్టర్‌ షన్మోహన్‌ను వివరణ కోరగా ‘‘జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డు, క్వారంటైన్‌లో ఉన్న వారికి భోజనం సరిగా అందించడం లేదని ఫిర్యాదులొచ్చాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement