Diet Control
-
బరువు తగ్గేందుకు పంటికి తాళం.. మరీ ఇంత క్రూరమా?
బరువు తగ్గటానికి చాలా మంది డైట్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ స్వీట్లు లేదా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే చాలు డైట్‌ను పక్కన పెట్టేస్తాం. ఆహారం తినకుండా నియంత్రించుకోలేని వారికోసం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధిపరిచారు. డైట్ నియంత్రించుకోవాలని అనుకునే వారి దంతాలకు ఈ పరికరాన్ని తగిలించుకుంటే చాలు మీరు చాలా నియంత్రణలో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ అని పిలిచే ఈ పరికరం దవడలోని పై దంతాలకు, కింది దంతాలను బోల్టు, అయస్కాంతం సాయంతో కలుపుతుంది. అప్పుడు నోటిని కేవలం 2 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే తెరవగలం. మాట్లాడటానికి లేదా గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుంది. దీంతో మనం ఏదైనా తినాలని భావించినా.. సాధ్యపడదు. పైగా ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకునే చాన్స్ ఉంటుంది. ఇలా డైట్‌ను నియంత్రించుకోవడం ద్వారా బరువు తగ్గించుకునేందుకు దోహదపడుతుందని యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పాల్ బ్రంటన్ వివరించారు. ఒక్కసారి బరువు తగ్గాక ఈ పరికరాన్ని డీ యాక్టివేట్ చేయొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని, చాలా చౌకగా లభిస్తుందని, బరువు తగ్గే శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. వీరు చెబుతున్నది బాగానే ఉన్నా.. ఈ పరికరం గురించి యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరమైన ఆవిష్కరణ ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు. -
డైట్ కాంట్రాక్టర్ కక్కుర్తి..
డైట్ కాంట్రాక్టర్ కక్కుర్తి.. కరోనా పాజిటివ్ బాధితులు, అనుమానితులకు ప్రాణ సంకటంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రోగులకు ఆహారం ఇవ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఆస్పత్రుల్లో సాధారణ రోగి భోజనానికి రూ.40 వెచ్చిస్తున్న ప్రభుత్వం.. కరోనా బాధితులు,అనుమానితులకు మాత్రం ఒక్కొక్కరికి రూ.100 ఖర్చు చేస్తోంది. నిపుణులైనడైటీషియన్లు సూచన మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక మెనూ అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఒంగోలు జీజీహెచ్ డైట్ కాంట్రాక్టర్ మాత్రం కరోనాబాధితులు, అనుమానితులకు సరైన పోషకాహారం ఇవ్వకుండా నిధులు మింగేస్తున్నాడు. ఇతని తీరుతో రోగులు, వారి బంధువులు విసిగి వేసారి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు సెంట్రల్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది ఒంగోలు జీజీహెచ్‌లో పరిస్థితి. కరోనా బాధితులకు మంచి ఆహారం అందించాలంటూ ప్రభుత్వం మామూలుగా ఇచ్చేదానికంటే రెండున్నర రెట్లు అదనంగా నిధులిస్తున్నా ఒంగోలు జీజీహెచ్‌లో డైట్ కాంట్రాక్టర్ మాత్రం రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. జీజీహెచ్‌లో శానిటేషన్ కాంట్రాక్ట్ నుంచి డైట్ కాంట్రాక్ట్ వరకు ప్రతిదీ ఇదే కాంట్రాక్టర్ కనుసన్నల్లో నడుస్తున్నాయి. శానిటేషన్ కాంట్రాక్ట్ వేరే వ్యక్తులు పొందినప్పటికీ సబ్ కాంట్రాక్ట్ మాత్రం ఇతనే నిర్వహిస్తున్నాడు. ఏళ్ల తరబడి జీజీహెచ్‌లో అన్ని కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తున్న ఇతను ఆస్పత్రి అధికారులను నయానో, భయానో లొంగదీసుకుని దందా కొనసాగిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండతో రోగులకు సరైన భోజనం పెట్టకుండా లక్షల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒంగోలు జీజీహెచ్‌లోని సాధారణ రోగులతోపాటు, క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు పౌష్టికాహారం అందించాల్సిన డైట్ కాంట్రాక్టర్.. నాసిరకమైన ఆహారాన్ని పెడుతుండటంతో రోగులు ఇటీవల ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా అతని తీరు మాత్రం మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ తీరుపై రోగుల ఫిర్యాదు క్వారంటైన్లో ఉన్న వారికి పోషకాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచి, ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒంగోలు జీజీహెచ్‌లో కోవిడ్ 19 రోగులకు కాంట్రాక్టర్ పోషకాహారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. జీజీహెచ్‌లోని కోవిడ్ 19 వార్డులో ఉండే రోగులు తమకు అందించే డైట్ నాణ్యంగా లేదని అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. జీజీహెచ్‌లో సాధారణ రోగులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.40 చెల్లిస్తోంది. అయితే కోవిడ్–19 రోగులకు ప్రత్యేక పోషకాహారం అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో రోజుకు రూ.100 చెల్లిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్ కక్కుర్తితో పోషకాహారం అందించకుండా నిధులు కాజేస్తున్నాడు. జీజీహెచ్‌లో దాదాపు 120 నుంచి 150 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. వీరిలో కరోనా పాజిటివ్ బాధితులు, క్వారన్‌టైన్‌లో ఉన్న వారు కలిపి 70 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక ఆహారం అందించాల్సిన బాధ్యత డైట్ కాంట్రాక్టర్‌పై ఉంది.ఈ విషయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కుడా మౌనం దాల్చడంతో రోగులకు పౌష్టికాహారం అందడం లేదు. ఆహారమే కీలకం కరోనా సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి. ఒక వేళ కరోనా సోకితే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ తగిన మందులు తీసుకోవాలి. నిర్ధిష్టమైన మందు లేని కరోనా వైరస్‌ను జయించాలంటే ఆహారమే కీలకం. అధికంగా పోషకాలుండే ఆహారం తీసుకోకపోతే కరోనా కాటుకు బలి కావాల్సిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండే రోగులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సోకిన వారితోపాటు అనుమానితులను కుడా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తోంది. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కొవాలంటే రోగ నిరోధక శక్తి కీలకం కావడంతో వ్యాధిగ్రస్తులు, క్వారంటైన్లో ఉండే వారు త్వరగా కోలుకోవడానికి బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. నిపుణులైన డైటీషియన్ల సూచనల మేరకు రోగుల కోసం ప్రత్యేక మెనూనూ రూపొందించారు. ఈ మెనూ ప్రకారం భోజనంలో నారింజ, అరటి, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూర, లెమన్ వాటర్, ఉడకబెట్టిన గుడ్లు అందించాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగులు వైరస్‌తో పోరాడి త్వరగా కోలుకునేందుకు వీలుకలుగుతుంది. అయితే డైట్ కాంట్రాక్టర్ ధనార్జన రోగులపాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. డైట్ కాంట్రక్టార్ తీరుపై జాయింట్ కలెక్టర్ షన్మోహన్ను వివరణ కోరగా ‘‘జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు, క్వారంటైన్లో ఉన్న వారికి భోజనం సరిగా అందించడం లేదని ఫిర్యాదులొచ్చాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. -
కల్తీపై ‘పిడి’కిలి!
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ఆహార నియంత్రణ విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆహార నాణ్యతా నియంత్రణ విభాగం సిబ్బంది కొరతతో అవస్థలు పడుతోంది. కనీసం ఆహార నమూనాలను సేకరించే పరిస్థితి కూడా లేదు. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మంది జనాభాకు ఒకరు చొప్పున ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు అధికారులు ఉండాలి. 15 జిల్లాల్లో నియంత్రణ అధికారుల్లేరు... రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 మంది ఆహార నియంత్రణ అధికారులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు, 15 జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. మరో 15 జిల్లాల్లో ఆహార నియంత్రణ విభాగమేలేదు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. ఏది కల్తీయో, ఏదీ నాణ్యమైన పదార్థమో తెలియని పరిస్థితి ఉంది. కల్తీ నియంత్రణ దాదాపు లోపించింది. ఆహార కల్తీపై ఇటీవల హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ నియంత్రణకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారో తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 23న దీనిపై హైకోర్టుకు నివేదించాల్సి ఉండగా వాయిదా పడింది. హైకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పాలుపోవడంలేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏడాది క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఆహార నియంత్రణ అధికారి ఉన్న జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్(ముగ్గురు), వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్. -
సర్జరీ చేస్తే... బరువు పెరుగుతారా?
నా వయసు 37. పెళ్లయ్యింది. ఓ పాప కూడా ఉంది. రెండేళ్ల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. పీరియడ్స్ సమస్యలు కూడా తలెత్తడంతో డాక్టర్‌ను సంప్రదించాను. గర్భసంచిలో పెద్ద కణితి ఉందని అన్నారు. ప్రమాదకర పరిస్థితి అని చెప్పి గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నాకు ఆరోగ్య సమస్యలైతే పెద్దగా ఏమీ లేవు. కానీ బాగా లావైపోతున్నాను. 67 కిలోలు ఉండేదాన్ని, ఇప్పుడు 79 కిలోలకు చేరుకున్నాను. డైట్ కంట్రోల్ చేసినా పెద్దగా తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే అలాగే లావవుతారు అంటున్నారు మావాళ్లు. నిజమేనా? ఇలా బరువు పెరగడం ప్రమాదకరం కాదా? ఇప్పుడు నేనేం చేయాలి? - వి.పూర్ణిమ, కరీంనగర్ గర్భాశయం తొలగించడం వల్లనే బరువు పెరగడం ఉండదు. పెద్ద ఆపరేషన్ అయ్యిందని చాలామంది చాన్నాళ్లపాటు పని చెయ్యకుండా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, బలహీనపడకుండా ఉండాలని ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయడం వల్ల లావు పెరగ వచ్చు. లేదా మీ విషయంలో థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయేమో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి మందులు వాడి చూడొచ్చు. కేవలం డైటింగ్ చేయడం వల్ల లావు తగ్గరు. మూడు పూటలా పరిమితమైన ఆహారం... అంటే ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ, అన్నం, చపాతీలు తక్కువగా తీసుకోవడం, నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం అన్నమాట. మొత్తంగా తిండి బాగా తగ్గించేసి కూర్చుంటే నీరసం తప్పితే, లావు తగ్గడం కష్టం. ఎక్కువగా నడక, యోగా, వ్యాయామాలు చెయ్యడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గుతారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, బీపీ, షుగర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. నా వయసు 23. పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టిన తర్వాత కాపర్-టి వేయించుకున్నాను. మొదట బానేవుంది. కానీ తర్వాత ఏదో అసౌకర్యంగా అనిపించసాగింది. ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటోంది. డాక్టర్‌కు చూపిస్తే చెకప్ చేసి అంతా బాగానే ఉందన్నారు. కానీ ఇప్పటికీ అదే ఇబ్బంది. ఎప్పుడూ అలా ఉండటం లేదు కానీ ఒక్కోసారి ఉన్నట్టుండి అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి? ఇది తీయించేసుకుంటే కుటుంబ నియంత్రణకు మరో మంచి మార్గమేదైనా ఉందా? - సావిత్రి, యానాం కాపర్-టి లేదా లూప్... టీ ఆకారంలో ఉండే సన్నని ప్లాస్టిక్ ముక్క మీద కాపర్ తీగలు చుట్టబడి ఉండే ఒక కుటుంబ నియంత్రణ సాధనం. దానికి చివర్లో తోకలాగా సన్నటి వెంట్రుక పోగు వంటి దారాలు వేళాడుతుంటాయి. దీన్ని గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. దానికి వేళాడే సన్నటి దారాలను కొద్దిగా ఉంచి కత్తిరించడం జరుగుతుంది. ఆ దారాలు గర్భాశయ ముఖద్వారం నుంచి యోని లోపల భాగంలోకి వేళాడుతుంటాయి. వీటి ద్వారా కాపర్-టి వేసిన తర్వాత, చెకప్‌లతో కాపర్-టి గర్భాశయంలో ఉందా లేదా అనేది పరీక్షించి నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు... లోపల ఏదో ఉందనే భావన లేదా గుచ్చుకోవడం ఉండదు. బాగా లోపలికి వేళ్లు పెడితే, ఆ దారాలు కొద్దిగా చేతికి తగులుతాయి తప్ప, ఇంక వేరే ఫీలింగ్ ఏమీ ఉండదు. అలా నెలకొకసారి సొంతంగా చూసుకోవడం వల్ల కూడా కాపర్-టి లోపల ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కలయికలో కూడా గుచ్చుకోవడం వంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్నిసార్లు కాపర్-టి కిందికి జరిగినప్పుడు ఆ దారాలు కూడా జారి కలయిక సమయంలో యోని లోపల గుచ్చుకున్నట్లు అనిపించవచ్చు. మీకు చెకప్‌లో అంతా సరిగానే ఉందని చెప్పారు కాబట్టి, ఇబ్బంది కూడా ఎప్పుడో ఒకసారి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కాపర్-టి కాకుండా తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా ఉండటం కోసం, నెలనెలా కుటుంబ నియంత్రణ మాత్రలు (oral contraceptive pills) ఉంటాయి. పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల పాటు రోజుకొకటి చొప్పున, మర్చిపోకుండా రాత్రిపూట... అదే సమయంలో వేసుకోవాలి. లేదా మీవారు కండోమ్స్ వాడొచ్చు. ఇవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. లేదా మూడు నెలలకోసారి మెడ్రాక్సి ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్ (medroxyprogesterone injection) తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ డోసులు తీసుకుంటే, చాలామందిలో బ్లీడింగ్ క్రమం తప్పడం, మధ్యమధ్యలో స్పాటింగ్ కనిపించడం, తర్వాత కాలంలో పీరియడ్స్ చాలాకాలం రాకుండా ఆగిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఏ పద్ధతి అయినా... వారి వారి శరీరతత్వాన్ని బట్టి వాటి పనితీరు ఉంటుంది.