బరువు తగ్గటానికి చాలా మంది డైట్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ స్వీట్లు లేదా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే చాలు డైట్‌ను పక్కన పెట్టేస్తాం. ఆహారం తినకుండా నియంత్రించుకోలేని వారికోసం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధిపరిచారు. డైట్ నియంత్రించుకోవాలని అనుకునే వారి దంతాలకు ఈ పరికరాన్ని తగిలించుకుంటే చాలు మీరు చాలా నియంత్రణలో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ అని పిలిచే ఈ పరికరం దవడలోని పై దంతాలకు, కింది దంతాలను బోల్టు, అయస్కాంతం సాయంతో కలుపుతుంది.
అప్పుడు నోటిని కేవలం 2 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే తెరవగలం. మాట్లాడటానికి లేదా గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుంది. దీంతో మనం ఏదైనా తినాలని భావించినా.. సాధ్యపడదు. పైగా ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకునే చాన్స్ ఉంటుంది. ఇలా డైట్‌ను నియంత్రించుకోవడం ద్వారా బరువు తగ్గించుకునేందుకు దోహదపడుతుందని యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పాల్ బ్రంటన్ వివరించారు.
ఒక్కసారి బరువు తగ్గాక ఈ పరికరాన్ని డీ యాక్టివేట్ చేయొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని, చాలా చౌకగా లభిస్తుందని, బరువు తగ్గే శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. వీరు చెబుతున్నది బాగానే ఉన్నా.. ఈ పరికరం గురించి యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరమైన ఆవిష్కరణ ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment