చంద్రికల్లో అల్లుతున్న పట్టు గూళ్లు
గిద్దలూరు: పట్టు రైతులకు కరోనా కాటు పడింది. కరోనా వైరస్ దాటికి పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టు పురుగులను పెంచుతున్న రైతులు పురుగులను మేపాలా, వద్దా అనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఎకరం పొలంలో మల్బరీ ఆకు పెంచేందుకు, పట్టు గుడ్లు కొనుగోలు, చాకీ ఖర్చులు, గూళ్ల దిగుబడికి రూ.ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తికాగా, మరి కొందరు రైతులు పట్టు గూళ్లు తీయాల్సి ఉంది. కొందరు రైతులు పురుగులు నాలుగో దశలో ఉన్నాయి. పంట పూర్తయి పట్టుగూళ్లు తీసిన రైతులు వాటిని విక్రయించుకునేందుకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట చివరి దశలో ఉన్న రైతులు గూళ్లు కట్టించాలా.. ముందే పంటను పడేయాలా అనే సందేహంలో ఉన్నారు. కిలో పట్టుగూళ్లు రూ.700 నుంచి రూ.750 వరకు ధర పలుకుతున్న తరుణంలో మార్కెట్‌లు మూతవేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు..
జిల్లాలో మల్బరీ సాగు దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం 70 ఎకరాల్లో రైతులు పట్టు పురుగులు పెంచుతున్నారు. వీరికి పట్టుపరిశ్రమ శాఖ ద్వారా నర్సరీలు పెంచి పట్టు పురుగులు రెండు దశలు వచ్చే వరకు 8 రోజుల పాటు పెంచి ఇస్తారు. ఇక రైతులు 19 రోజులు మాత్రమే పురుగులను సంరక్షించి గూళ్లు కట్టించి మార్కెట్‌లో విక్రయించాల్సి ఉంది. గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట మండలాల్లో పట్టురైతులు 250 మంది వరకు 500 ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. వీరంతా పట్టు పురుగులను పెంచి చంద్రికల్లో వేశారు. గూళ్లు అల్లే దశలో ఉన్నాయి. కొందరు రైతులు గూళ్లు పూర్తయిన రెండు రోజుల్లోనే మార్కెట్‌కు తరలిస్తారు. లేదంటే పట్టుగూడుకు రంద్రం వేసి పురుగు పక్షిగా మారి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత పట్టు గూడు విక్రయానికి పనికిరాదు. దారం తెగిపోవడం వలన విక్రయించడం వీలు పడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు మండలంలోని ఒక్క పొదలకుంటపల్లె గ్రామంలోనే 23 మంది పట్టు రైతులు ఉన్నారు.
పట్టు రైతులకు తీరని నష్టం
కరోనా వైరస్‌తో పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో జిల్లాలోని పట్టు రైతులకు తీరని నష్టం వాటిల్లింది. 750 మంది రైతులు దాదాపు లక్షా, 50 వేల పట్టు గుడ్లు కొనుగోలు చేసి పెంచుతున్నారు. తద్వారా ఒక లక్ష కిలోల పట్టు గూళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కిలో రూ.700 చొప్పున రూ.7 కోట్ల వరకు పట్టు రైతులు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం ఇచ్చేందుకు పటుపరిశ్రమ అధికారులు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
250 పట్టు గుడ్లు పెంచుతున్నాను
తాను ఎకరంలో మల్బరీ సాగుచేస్తున్నాను. 250 పట్టు గుడ్లు తీసుకొచ్చి పెంచుతున్నాను. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తయి పట్టు పురుగులు గూళ్లు అళ్లాక మార్కెట్‌కు వెళ్తే కొనుగోలు చేసేవారు లేక వెనక్కు వచ్చారు. తాను రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి పురుగులను పెంచుతున్నాను. మార్కెట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు.– ఎస్.మోహన్‌రెడ్డి, పట్టు రైతు, పొదలకుంటపల్లె
Comments
Please login to add a commentAdd a comment