కరోనా నుంచి కోలుకుని ఒంగోలు జెడ్పీ కాలనీలో ఇంటికి చేరుకున్న యువకుడు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మొట్టమొదటగా కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు వైద్యులు చెప్పినట్లుగా వారికి సహకరిస్తూ కరోనాను జయించాడు. ఒంగోలు నగరంలోని జెడ్పీ కాలనీకి చెందిన యువకుడు మార్చి 15వ తేదీ ఉదయం లండన్ నుంచి ఒంగోలుకు చేరుకున్నాడు. 17వ తేదీన ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేటెడ్ వార్డులో చేర్చారు. మార్చి 18వ తేదీ రాత్రి అతనికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆ యువకుడు జీజీహెచ్ ఐసోలేటెడ్ వార్డులోనే చికిత్స పొందుతున్నాడు. 14 రోజుల చికిత్స అనంతరం శాంపిల్స్‌ను రెండుసార్లు ల్యాబ్‌కు పంపగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు శుక్రవారం సాయంత్రం ఆ యువకుడిని ఒంగోలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు.
లండన్ నుంచి వచ్చి జీజీహెచ్‌లో చేరినప్పటి నుంచి ఆ యువకుడు, వారి కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో తమకు సహకరించడం వల్లే వారు వ్యాధి నుంచి బయటపడ్డారని, ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే విధంగా బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. యువకుడి తల్లిదండ్రులు, సోదరిని సైతం జీజీహెచ్ క్వారంటైన్‌లో ఉంచి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరిన సంగతి తెలిసిందే. జీజీహెచ్ వైద్యులు గురువారం సాయంత్రం 38 శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపగా అన్నీ నెగటివ్ వచ్చాయి. పాజిటివ్ కేసులు తగ్గడంతో అధికారులు, వైద్యులతోపాటు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జీజీహెచ్ వైద్యులు శుక్రవారం పంపిన మరికొంత మంది అనుమానితుల్లో ముగ్గురి శాంపిల్స్ రిపోర్టులు నెగటివ్‌గా వచ్చాయి.
జీజీహెచ్ క్వారంటైన్ నుంచి యువకుడు పరారీ ;పట్టుకుని తీసుకువచ్చిన పొలీసులు
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు జీజీహెచ్ క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు శుక్రవారం ఉదయం పారిపోయాడు. జీజీహెచ్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువకుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సొంత ఊరు అమ్మనబ్రోలులో ఉన్నట్లు గుర్తించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ యువకుడు హైదరాబాద్ నుంచి ఇటీవలే ఒంగోలు వచ్చాడు. జలుబు, దగ్గుతో బాధపడుతూ గత నెల 27వ తేదీన జీజీహెచ్‌కు స్వయంగా వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఇతనికి కరోనా లక్షణాలు లేవని ఈ నెల 2వ తేదీన రిపోర్ట్ వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం ఉదయం నుంచి యువకుడు కనిపించకపోవడంతో పోలీసులు వెతికి పట్టుకుని తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment