అదుపులోకి వస్తున్న ‘కరోనా’ | Corona Virus Cases Down in Kurnool | Sakshi
Sakshi News home page

అదుపులోకి వస్తున్న ‘కరోనా’

Published Sat, May 9 2020 11:55 AM | Last Updated on Sat, May 9 2020 12:35 PM

Corona Virus Cases Down in Kurnool - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌)/(సెంట్రల్‌): జిల్లాలో కరోనా వైరస్‌(కోవిడ్‌–19) దూకుడు తగ్గుతోందా? ఇటీవల నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే నిజమేననిపిస్తోంది. వారం రోజుల నుంచి రోజూ 25 నుంచి 40 దాకా కేసులు నమోదవుతూ వచ్చాయి. మూడు రోజులుగా ఆ సంఖ్య క్రమంగా తగ్గి బుధవారం 17, గురువారం 7, తాజాగా శుక్రవారం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసుల్లో కర్నూలులో రెండు, నంద్యాలలో రెండు, ఆదోనిలో ఒకటి, మహానందిలో రెండు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు   కరోనా కేసుల సంఖ్య 547కు చేరుకోగా..శుక్రవారం 27 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 218 మంది కరోనాను జయించారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స      పొందుతూ వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కోలుకోలేక 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 315గా ఉంది. 

క్వారంటైన్‌ కేంద్రాలు మూత..
జిల్లాలో మొత్తం 24 క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1800 కరోనా అనుమానితులను ఉంచి వారికి నిర్ధారణ పరీక్షలు చేశారు. క్వారంటైన్‌ వ్యవధి 14 రోజుల తరువాత చాలామందికి కరోనా నెగటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేశారు. కొందరికి పాజిటివ్‌ రావడంతో చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్లలో వారందరూ  వెళ్లిపోవడంతో వాటిని మూత వేశారు.  

ఎక్కువగా ‘కోవిడ్‌’ పరీక్షలు..
జిల్లాలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా  జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు..వారితో సంబంధాలు కొనసాగించిన 12 వేల మందికి, ఓ వైద్యుడు కరోనాతో మృతి అతని కాంటాక్ట్స్‌ మరో4 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరేగాక ఇతర ప్రాంతాల్లో కేసులు రాకపోవడంతో పరీక్షలు       జరిపారు. జిల్లాలో ‘కరోనా’ బాధితులు ఎక్కువగా ఉన్నా.. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశంసలందుకున్నారు.   

పది ప్రాంతాల్లో జీరోకు చేరినకేసుల సంఖ్య
ఒక్కో కేసు ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తులు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో అక్కడ కేసుల సంఖ్య జీరోగా మారింది. ఇలా మారిన ప్రాంతాల్లో బేతంచెర్ల, డోన్‌ మున్సిపాలిటీలు, గడివేముల, బండిఆత్మకూరు, కల్లూరు, కృష్ణగిరి, నందికొట్కూరు, ఓర్వకల్లు, రుద్రవరం, సంజామలమండలాలు ఉన్నాయి.

పండుటాకులే కాదు పసిపిల్లలూ జయించారు
కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 80 ఏళ్ల వృద్ధుడు విజేత అయ్యారు. కర్నూలు గనిగల్లి ప్రాంతానికి చెందిన ఈయన గత నెల 14వ తేదీన విశ్వభారతి కోవిడ్‌ హాస్పిటలో చేరారు. ఆయనకు రెండు సార్లు కరోనా పరీక్షల అనంతరం నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. అలాగే శాంతిరాం అసుపత్రి  నుంచి నంద్యాలకు  చెందిన ఎనిమిదేళ్ల బాలిక డిశ్చార్జ్‌ అయ్యారు. విశ్వభారతి ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా డిశ్చార్జ్‌ కాగా.. అందులో 16 నెలల బాలుడు కూడా ఉన్నారు.  

లక్షణాలు స్పల్పమే..
పాజిటివ్‌ వచ్చిన చాలా మందిలో కరోనా లక్షణాలే కనిపించడం లేదు. ఇలాంటి వారిని ఇళ్లలోనే ఉంచి, సాధారణ చికిత్స అందిస్తే చాలు అని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే రోగుల ఇళ్లలో వారు ఒంటరిగా ఉండేందుకు అవసరమైన గదులు కచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో కోవిడ్‌ ఆసుపత్రుల్లోనే ఉంచాలని నిబంధనను మెలిక పెట్టింది. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చినా.. కరోనా లక్షణాలు లేని వారి కోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలులో దాదాపు 2 వేల బెడ్లతో మూడు కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కర్నూలు టిìడ్కో హౌసింగ్‌లో 1000, నంద్యాల టిడ్కో హౌసింగ్‌ సొసైటీలో 700, కర్నూలులోని చైతన్య ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో 300 బెడ్లతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 24 గంటల వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు కావాల్సిన వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం కర్నూలులోని చైతన్య జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 81 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాటిలో ఎవరూ లేరు.  

నేడు కేంద్ర వైద్య బృందం రాక  
కేంద్ర వైద్య బృందం శనివారం సాయంత్రం జిల్లాకు రానుంది. ఆదివారం    నుంచి ఆరు రోజుల పాటు ఈ బృంద సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ బృందంలో ఆలిండియా ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి డైరెక్టర్‌ డాక్టర్‌ మధుమిత, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఉన్నారు. కర్నూలు, నంద్యాల.. తదితర ప్రాంతాలను వీరు సందర్శిస్తారు. స్టేట్‌ కోవిడ్‌ హాస్పిటల్‌ అయిన కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలను, కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌ను, అక్కడి వైద్యసౌకర్యాలు, పరికరాలను, రోగుల వివరాలను వారు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే విశ్వభారతి కోవిడ్‌ హాస్పిటల్, శాంతిరామ్‌ హాస్పిటల్‌లను సైతం వారు సందర్శించనున్నారు.

547జిల్లాలో మొత్తం కరోనా కేసులు
218కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారు
315ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement