![Corona Virus Sensation in the GGH - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/2/coronavirus.jpg.webp?itok=-euBRldh)
గుంటూరు మెడికల్/తిరుపతి తుడా: గుంటూరు జీజీహెచ్‌లో గురువారం రాత్రి అడ్మిట్ అయిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిందన్న వదంతులు కలకలం రేపుతున్నాయి. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న అతడిని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫిజి దేశానికి చెందిన 50 ఏళ్ల వయసున్న అతను విహార యాత్రలో భాగంగా సింగపూర్ వెళ్లి, అక్కడి నుండి ఢిల్లీకి, తర్వాత విజయవాడకు వచ్చాడు. కాగా, ఇతడికి కరోనా వైరస్ సోకిందనే వదంతులు వ్యాపించటంతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.
ఇలాంటి వారిని గోరంట్ల జ్వరాల ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో ఉంచితే ఇతరులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా నివారించవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్‌కర్ బాబులాల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విదేశీయుడికి కరోనా వైరస్ సోకిందనేది కేవలం అపోహేనని తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే అతడిని ఏఎంసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పతకమూరి పద్మలత వెల్లడించారు. ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం చైనా నుంచి తిరిగొచ్చిన చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఓ కుటుంబాన్ని (ఓ మహిళ, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి) అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. వైద్యులు పరీక్షించి వారికి కరోనా లక్షణాలు ఏ మాత్రం లేవని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment