లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్–19 స్టేట్ హాస్పటల్‌లో నాల్గవ తరగతి సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు, డబ్బులు చోరీ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్ తస్కరించడం చూసి అధికారులు అవాక్కయ్యారు. నిత్యం ఇలా రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు, డబ్బులు పోతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసినప్పటి నుంచి ఆ ఉద్యోగి ఎవరు అని కూపీ లాగుతున్నారు. ఇలా ఇంకా ఎవరెవరు చోరీలకు పాల్పడుతున్నారు.. వారి ప్రవర్తన ఏమిటి అని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఐసీయూలోనే ఎక్కువ..
కరోనా సోకిన రోగులతో పాటు, సస్పెక్టెడ్ రోగుల సైతం కోవిడ్–19 ఆస్పత్రిలో చేరుతున్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న, ఐసీయూలో ఉన్న రోగుల వద్ద అటెండెంట్‌లను అనుమతించరు. వారికి ఏమి కావాలన్నా సిబ్బంది చూసుకోవాల్సిందే. దీనిని తమకు అనుకూలంగా కొందరు సిబ్బంది మలుచుకుని తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న రోగులు, మృతిచెందిన రోగుల వద్ద ఉన్న మొబైల్స్, వస్తువులు, డబ్బులు మాయం అవుతున్నట్లు చెబుతున్నారు. ఐసీయూలో అనుభవం ఉన్న వర్కర్‌లను నియమించాల్సి ఉండగా, ఇటీవల కొత్తగా చేరిన వారిని విధుల్లో వేయడంతో వారు, సేవలు అందించడం మాని చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పర్యవేక్షణ శూన్యం..
ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవలి కాలంలో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా వార్డులో రోగి పరిస్థితి విషమించి వెంటిలేటర్‌పై పెట్టాల్సి వస్తే వైద్యులకు çసహాయంగా ఉద్యోగులు ఉండాలి. కానీ ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాదు ఐసీయూలో మరణించిన వారి మృతదేహాలను మార్చురీకి తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి మరణించిన వారిని మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మార్చురీకి తరలించిన ఘటనలు ఉన్నట్లు చెబుతున్నారు. సిబ్బందిపై సరైన అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రాణాలకు తెగించి కొందరు సేవలు..
కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ రోగుల వస్తువులు తస్కరిస్తుండగా, మరికొందరు సిబ్బంది మాత్రం ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఐసోలేషన్, ఐసీయూల్లో ఉన్న రోగులకు అన్నీ తామై చూస్తున్నారు. వారికి భోజనం పెట్టడం, మంచినీళ్లు ఇవ్వడం, మందులు ఇవ్వడం వంటి పనులు అన్నీ సిబ్బందే చూస్తున్నారు. అయితే కొందరు సిబ్బంది ప్రవర్తనతో ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెల్‌ఫోన్ చోరీని గుర్తించాం
వ్యక్తి అదృశ్యంపై సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తుండగా ఒక రోగి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఉద్యోగి తీయడాన్ని గుర్తించాం. ఉద్యోగి పీపీఈలో ఉండటంతో ఎవరనే విషయాన్ని విచారణ చేస్తున్నాం. రోగి ఒక్కరే ఐసీయూలో ఉంటున్నారు. వారిని సేవా భావంతో చూడాలే కానీ ఇలా చేయడం సరికాదు. అలా చేసే సిబ్బందిని సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి. నాంచారయ్య, సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment