దాచేపల్లిలో కరోనా కలకలం; 144 సెక్షన్‌ అమలు  | Corona Virus Is Spreading In D​hachepalli | Sakshi
Sakshi News home page

దాచేపల్లిలో కరోనా కలకలం; 144 సెక్షన్‌ అమలు 

Published Sun, Apr 12 2020 7:41 AM | Last Updated on Sun, Apr 12 2020 8:05 AM

Corona Virus Is Spreading In D​hachepalli - Sakshi

అధికారులకు సూచనలు ఇస్తున్న ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి

సాక్షి, దాచేపల్లి(గురజాల): దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో కరోనా కలకలం రేపింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహామ్మరి దాచేపల్లికి కూడా తాకటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురానికి చెందిన ఓ వ్యక్తి  కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతూ కరోనా లక్షణాలతో మృతిచెందినట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో మృతిచెందిన వ్యక్తి నివసించే వీధితో పాటుగా సమీపంలోని వీధుల్లో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 

పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి 144 సెక్షన్‌ విధించారు. 
ఈ ప్రాంతంలో ఎవరూ రాకపోకలు సాగించకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ వీధుల్లోకి రావొద్దంటూ ఎవరి వీధి వద్ద వారు ముళ్లకంచెను అడ్డుగా వేసుకున్నారు. 
రెడ్‌జోన్‌ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని యంత్రం ద్వారా పిచికారీ చేయించారు. వీధుల్లో బ్లీచింగ్‌ చల్లించారు. రెడ్‌జోన్‌ ప్రాంతంలో ప్రజలు వీధుల్లోకి రావద్దని మైక్‌ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.    
కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో నేటి నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలుపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాసు పాల్గొన్నారు. చదవండి: మీ వ్యూహంతో ముందుకు సాగుతాం 

నారాయణపురంలో  కరోనాతో మృతిచెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే వీధి నిర్మానుష్యంగా ఉన్న దృశ్యం 

నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ యంత్రంగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, వారికి పాదాభివందనం చేసినా రుణం తీర్చుకోలేమన్నారు. లాక్‌డౌన్‌ కఠినతరం చేస్తున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. 
దాచేపల్లిలో మృతుడు ఎవరెవరిని కలిసాడో..ఏ ఏ గ్రామాలకు వెళ్లాడో అనే వివరాలు తెలుసుకుంటున్నామని, దీని తీవ్రత ఎంతవరకు ఉంటుందో పరిశీలన చేస్తున్నామని ఎమ్మెల్యే కాసు తెలిపారు. 
గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండటం వలన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారని, నేటి నుంచి 10 రోజుల పాటు కఠినంగా వ్యవహరించనున్నారని చెప్పారు. 
కరోనా వైరస్‌ తీవ్రత తగ్గేంతవరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

క్వారంటైన్స్‌కు తరలింపు 
దాచేపల్లి(గురజాల): దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకావటంతో ప్రభుత్వ అధికారులు అప్రమతం అయ్యారు.కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. మృతిచెందిన వ్యక్తి బయట సన్నిహితంగా ఉండే వ్యక్తుల వివరాలను ఆరా తీసి తెలుసుకున్నారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి 13మందితో ప్రాథమికంగా సన్నిహితంగా ఉన్నట్లుగా, మరో 34 మందితో కూడా సన్నిహితంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించి తెలుసుకున్నారు. వీరిలో 13మందిని కేఎల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి, మరో 34మందిని దాచేపల్లి ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి ఇంటి పరిసరాలతో పాటుగా పలు వీధుల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.‍ చదవండి: కరోనా ఎఫెక్ట్‌: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కాల్చివేత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement