మృగాడి దాష్టీకం.. భగ్గుమన్న దాచేపల్లి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం అట్టుడికిపోయింది. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనతో గురువారం జిల్లా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. రోజూ ‘తాతా’ అని పిలిచే చిన్నారిపై అతి కిరాతకంగా నిందితుడు సుబ్బయ్య ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో వదిలేయమని ఏడుస్తూ ఎంత ప్రాథేయపడ్డా కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాడి మనస్సు కరగలేదు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఊరు నుంచి పరారయ్యాడు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో బుధవారం రాత్రి దాచేపల్లి వాసులు అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి తెల్లవార్లూ ఆందోళన చేశారు. గురువారం ఉదయం కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి బాలిక కుటుంబానికి మద్దతుగా నిలిచారు. నిందితులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తితో పాటు, పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నిందితుడు అన్నం సుబ్బయ్య
ఈ ఆందోళన ఒక్కచోటకే పరిమితం కాకుండా దాచేపల్లిలోని బంగ్లా సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, ముత్యాలంపాడు, కేసానుపల్లి రోడ్డు, నడికుడి మార్కెట్ యార్డు సెంటర్, గామాలపాడు గ్రామాల వద్ద ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి టైర్లను తగులబెట్టి బాలికకు న్యాయం చేయాలంటూ నినదించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. హైవేపై రాత్రంతా రాస్తారోకో నిర్వహించడంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసుల హామీ మేరకు గురువారం తెల్లవారుజామున ఆందోళన విరమించిన ప్రజలు.. మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా సుబ్బయ్యను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మళ్లీ హైవేపై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్న పిల్లలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. దాచేపల్లి ఘటనపై మాచర్ల, గుంటూరు నగరాలతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
కేసానుపల్లి రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న ప్రజలు
ఆర్టీసీ బస్సులు, నిందితుడి ఇల్లు ధ్వంసం
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్యను 24 గంటలు గడిచినా అరెస్టుచేయకపోవడంతో గురువారం పరిస్థితి అదుపు తప్పింది. జిల్లా రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు దాచేపల్లి పోలీసుస్టేషన్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ.. ప్రజలు నారాయణపురం ఆర్ అండ్ బీ బంగ్లా సెంటర్లో గుంటూరు–2, మాచర్ల డిపోలకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అంతేకాక.. నిందితుడు అన్నం సుబ్బయ్య ఇంటిపై దాడిచేసి కూల్చివేశారు. ‘చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను చించి వేశారు. దాచేపల్లి పట్టణంలో హైవేపై పలు ప్రాంతాల్లో భారీగా జనం మోహరించి ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పోలీసులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఓ దశలో రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆందోళనకారుల వద్దకు వచ్చి నిందితుడిని కచ్చితంగా అరెస్టుచేసి ఉరిశిక్ష పడేలా చేస్తామని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారి ఆగ్రహావేశాలు చల్లారలేదు. దీంతో గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సాయంత్రానికి దాచేపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని వదిలిపెట్టేదిలేదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, సీఎం కూడా తమతో మాట్లాడారన్నారు. బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరోవైపు.. ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ఎస్పీ నిందితుడు పట్టుబడే వరకూ తమకు సహకరించాలని కోరడంతో రాత్రి ఆందోళన విరమించారు.
నిందితుడి కోసం విస్తృత గాలింపు
కాగా, నిందితుడు సుబ్బయ్యను పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు ఏఆర్, టాస్క్‌ఫోర్స్‌ను సైతం రంగంలోకి దించారు. నిందితుడి సెల్ సిగ్నల్ ఆధారంగా దాచేపల్లి పరిసర ప్రాంతాల్లోనే కృష్ణానది వైపు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, కృష్ణానది వద్ద సిగ్నల్స్ ఆగిపోవడంతో సెల్‌ఫోన్ పడేసి ఎటైనా వెళ్లిపోయాడా, లేదా నదిలో దూకి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నది పరివాహక ప్రాంతంలో గాలిస్తున్నారు. కాగా, దాచేపల్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శుక్రవారం 144 సెక్షన్ విధించినట్టు ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు తెలిపారు.
నిర్భయ కేసు నమోదు
లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దాచేపల్లి ఎస్ఐ తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు అన్నం సుబ్బయ్యపై ఐపీసీ 376 (2) సెక్షన్ ప్రకారం ఫోక్సో యాక్ట్‌తో పాటుగా నిర్భయ కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే, బాధిత కుటుంబానికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న 14 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఘటన జరిగిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అద్దంకి–నార్కెట్‌పల్లి రోడ్డుపై బైఠాయించి నిందితుడిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా నాయకురాలు దేవళ్ల రేవతి అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని జిల్లాలోని మహిళలకు, బాలికలకు రక్షణ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పరామర్శించి అండగా ఉంటామంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాత్రి వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని లాడ్జి సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సీఎం రాజీనామా చేయాలి
గుంటూరు నగరంలో రాత్రి వైఎస్సార్సీపీ జిల్లా ముఖ్య నేతలు కూడా నోరు, కళ్లకు నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సీఎం, స్పీకర్, డీఐజీ, ఐజీ, ఎస్పీలు ఉన్న జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మూడు నెలల వ్యవధిలో జిల్లాలో ఇలాంటివి 40 సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళనకు వైఎస్సార్సీపీ సమాయత్తం
జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 20మంది బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. దాచేపల్లి ఘటనలో నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కె రోజాతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించి పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
షాక్‌లో బాలిక
బాధితురాలు గుంటూరు జీజీహెచ్‌లోని గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే, అత్యాచార ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. పలకరించేందుకు మగవాళ్లు ఎవరు వెళ్లినా ఉలిక్కిపడుతోందని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, 24 గంటలు గడిచిన తరువాత మరో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
బాలికకు పరామర్శల వెల్లువ
ఇదిలా ఉంటే.. బాలికను గురువారం ఉదయం ఐజీ కేవీవీ గోపాలరావు, కలెక్టర్ కోన శశిధర్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యురాలు పి.పద్మలత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బాలికను పరామర్శించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా కల్పించకుండా రాజకీయంగా విమర్శలు గుప్పించి వెళ్లిపోయారు.
దాచేపల్లిలోని ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టిన నిరసనకారులు