కర్నూలులో వన్‌టౌన్‌కు వెళ్లే రహదారిని దిగ్బంధం చేసిన పోలీసులు
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ వ్యక్తులను గుర్తించిన 133 క్లస్టర్లలో ప్రభుత్వం శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రతి క్లస్టర్‌లోనూ వైరస్ నివారణ, ప్రజారోగ్య చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్వారంటైన్, భౌతిక దూరం వంటి అంశాలను వివరించడంతోపాటు.. మెరుగైన నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కేసులన్నింటినీ పరీక్షిస్తారు. పాజిటివ్ వ్యక్తులు ఎవరెవరిని కలిశారో (కాంటాక్ట్స్) గుర్తించి అందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది.
కంటైన్మెంట్ క్లస్టర్లుగా..
► పాజిటివ్ కేసులు బయటపడిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటినీ కంటైన్మెంట్ క్లస్టర్‌గా గుర్తించి వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
► కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా బఫర్ జోన్‌గా గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బఫర్ జోన్లను 7 కిలోమీటర్ల వరకు విస్తరిస్తున్నారు.
► అత్యవసర సేవలు (వైద్య అత్యవసర పరిస్థితులు సహా), ప్రభుత్వ సేవలు మినహా కంటైన్మెంట్ జోన్ నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు.
► అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి.. వైరస్‌పై అవగాహన కల్పిస్తారు. అన్ని వాహనాల కదలిక, ప్రజా రవాణా నిషేధం.
► కంటైన్మెంట్ జోన్‌ను అనుసంధానించే గ్రామీణ రహదారుల సహా అన్ని రహదారులూ పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి.
► పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్స్ అన్నీ 12 గంటల్లోపు జాబితా తయారు చేసి, వాటిని ట్రాక్ చేస్తారు. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల నిఘా అనుక్షణం ఉంటుంది.
► క్లస్టర్లలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
క్లస్టర్లలో పోలీస్ ఆంక్షలు
కరోనా క్లస్టర్ పరిధిలోని రెడ్ జోన్లు, హాట్ స్పాట్లను పోలీస్ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు. క్లస్టర్ చుట్టూ ఉన్న మార్గాలను మూసేసి 28 రోజులపాటు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు. ప్రతి జోన్‌లో ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.ఆ ప్రాంతాల్లో ఆహార పదార్థాలను పంపిణీ చేసేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment