డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, కృష్ణా : ఢిల్లీలో జరిగిన సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా క్వారంటైన్‌కు రావాలిన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ సమావేశానికి సంబంధించిన జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిందన్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆలస్యం అయ్యే కొద్ది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని డీజీపీ మరోసారి గుర్తుచేశారు.
శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో ఏపీకి చెందిన విద్యార్థులను తీసుకవచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పదిరోజులు లాక్‌డౌన్ పాటించారని.. మరో పదిరోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో కరోనా రూపంలో వచ్చిన కొత్త చాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమపడుతున్నారని పేర్కొన్నారు. ‘మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి’అంటూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.
బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటన బాదకరమని, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. పోలీస్ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజల పట్ల హ్యూమన్ అప్రోచ్‌తో ఉండాలని సూచించారు. ప్రజల క్షేమం కోసం పోలీసులు కుటుంబ సభ్యులను వదిలి మరీ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.
చదవండి:
కరోనా : ప్రధాని మోదీకి మిథున్ రెడ్డి లేఖ
కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?
Comments
Please login to add a commentAdd a comment