
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఎకో టూరిజం కేంద్రాలు, అటవీ పర్యాటక కేంద్రాలు, పార్కులు, టెంపుల్ ఎకో పార్కులు, నగర వనాలు, జంతు ప్రదర్శనశాలలను శుక్రవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ప్రతీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా ప్రాంతాలకు రోజూ భారీగా సందర్శకులు వస్తున్నారని, వీటిని కొనసాగిస్తే కోవిడ్ ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల తక్షణమే వీటిని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల అధికారులకు ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.