కరోనా: నిర్లక్ష్యం వైరస్‌ | Coronavirus: Coronavirus Is Being Neglected By Doctors In Anantapur | Sakshi
Sakshi News home page

కరోనా: నిర్లక్ష్యం వైరస్‌

Published Wed, Apr 15 2020 10:30 AM | Last Updated on Wed, Apr 15 2020 10:30 AM

Coronavirus: Coronavirus Is Being Neglected By Doctors In Anantapur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలి 
క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులను శాశ్వత ప్రాతిపదికన నియమించండి. అందరూ ఒకే చోట కాకుండా వేర్వేరుగా విధులు నిర్వర్తించేలా చూడండి. వైద్యాధికారి ఆస్పత్రి వైద్యులతో సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా నివారణకు ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. 
– కరోనా నేపథ్యంలో డీఎంఈ, కలెక్టర్‌ చంద్రుడు చేసిన సూచనలివీ

అంతా నా ఇష్టం 
నేను చెప్పినట్లు చేయండి. రాష్ట్రాధికారులు, జిల్లా ఉన్నతాధికారి చెప్పినట్లు వినాలంటే కుదరదు. ఇక్కడ నేను ఏ డ్యూటీ వేస్తే అది చేయాల్సిందే. వైద్యులందరూ కరోనా పాజిటివ్‌ కేసులు చూడాల్సిందే.          – ఆస్పత్రిలోని కీలక వైద్యుడి తీరిదీ


అనంతపురం: ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యం.. సర్వజనాస్పత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందికి శాపంగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ సదరు కీలక వైద్యుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల చికిత్సపై ప్రభుత్వం పక్కాగా మార్గనిర్దేశకాలు చేసినా.. సర్వజనాస్పత్రిలోని కీలక వైద్యుడు మాత్రం మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, కలెక్టర్‌ చెప్పిన మాటలను సైతం సదరు అధికారి బేఖాతారు చేస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. 

ప్రణాళిక లేక.. ప్రాణాలు ఫణం 
కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స చేసే విషయంలో సర్వజనాస్పత్రిలోని కీలక వైద్యుడి అవగాహన లోపం స్పష్టం కనిపిస్తోంది. హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తికి ప్రారంభంలో సరిగా స్క్రీన్‌ చేయకపోవడంతో సర్వజనాస్పత్రిలో ముగ్గురు వైద్యులు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎస్‌ఆర్, హౌస్‌సర్జన్‌), ముగ్గురు స్టాఫ్‌నర్సులు వైరస్‌ బారిన పడ్డారు. వీరితో పాటు వంద మంది వరకు క్వారంటైన్‌కు వెళ్లారు. ఇంత జరిగినా సదరు వైద్యుడు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్‌ ఓపీకి 90 మంది వైద్యులను నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆదేశాల ప్రకారం కరోనా వార్డుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, సదరు వైద్యుడు మాత్రం గైనిక్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, తదితర వార్డుల నుంచి వైద్యులకు కరోనా క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులకు డ్యూటీలు వేశారు.

దీంతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు.. రెండు, మూడు రోజుల తర్వాత సాధారణ రోగులకు చికిత్సలు చేస్తున్నారు. పొరపాటున ఆ వైద్యులకు వైరస్‌ సోకితే పరిస్థితి చేయిదాటిపోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వార్డులకు శాశ్వత బృందాలను ఏర్పాటు చేసి, ఆ బృందాలు ఇతర సాధారణ రోగులను చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో కరోనాతో ఇద్దరు మృత్యువాత పడగా.. వారికి చికిత్స చేసిన వైద్యులే ఇతర రోగులకు వైద్యం అందించారని, దీని ద్వారా ఎంత మంది వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని వైద్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  

సదుపాయాల కల్పనలో విఫలం 
కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఏకంగా రూ.3 కోట్ల విలువ చేసే వివిధ రకాల పరికరాలు, మౌలిక సదుపాయాలను కలి్పంచింది. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు, ఎన్‌ 95 మాస్క్‌లు అవసరానికి మించి ఆస్పత్రికి పంపింది. కానీ వాటిని వైద్యులు, నర్సులకు అందివ్వకుండా ఆస్పత్రి ఉన్నతాధికారి తాత్సారం చేశారని, అందువల్లే వైద్యులు, సిబ్బంది ఇప్పుడు తీవ్ర భయాందోళన చెందుతున్నట్లు ఆస్పత్రిలోని ఉద్యోగులే చెబుతున్నారు. 

పాజిటివ్‌ కేసును విస్మరించిన వైనం 
సర్వజనాస్పత్రిలోని పరిపాలన వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. హిందూపురంలో నివాసముంటున్న ఓ తహసీల్దార్‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. సదరు తహసీల్దార్‌ గత వారంలో సర్వజనాస్పత్రికి రాగా... వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అదే సమయంలోనే తహసీల్దార్‌ పేరుతోనే ఉన్న మరో మహిళకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అందులో ఓ మహిళ పేరు మీద నెగిటివ్‌ రాగా... వైద్యులు మాత్రం సదరు తహసీల్దార్‌కే నెగిటివ్‌ వచ్చిందని నిర్ధారించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్‌ కుటుంబీకులు సైతం తమకు నెగిటివ్‌ వచ్చిందని డిశ్చార్జ్‌ చేయాలని వైద్యులతో వాగ్వాదం చేసినట్లు సమాచారం. చివరకు ఆస్పత్రి వైద్యులు ఆమెను, కుటుంబీకులను డిశ్చార్జ్‌ చేశారు.

అయితే ఆమెను డిశ్చార్జ్‌ చేసే సమయంలో ఈఎన్‌టీ వైద్యులు ముందస్తుగా మరోసారి త్రోట్, న్యాసో ఫ్యారింజిల్‌ స్వాప్‌ తీశారు. క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు ఆదేశించినా.. ఆమె మాత్రం తాను హోం క్వారంటైన్‌లో ఉంటామని వెళ్లిపోయారు. చివరకు ఆమెకు కరోనా పాజిటివ్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఆ తహసీల్దార్‌కు సాధారణ రోగులకు తీసే ఎక్స్‌రే గది 26లో ఎక్స్‌రే తీసినట్లు తెలిసింది. ప్రస్తుతం తహసీల్దార్‌కు ఎక్స్‌రే తీసిన సిబ్బంది, ఆమెకు సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ మరోసారి సర్వజనాస్పత్రి కీలక అధికారులకు తనదైన రీతిలో సూచలనలిస్తేనైనా మార్పు వచ్చే పరిస్థితి కని్పంచడం లేదు.  

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి : మంత్రి 
అనంతపురం: కరోనా కట్టడికి జిల్లాలో పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, వైరస్‌ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కోవిడ్‌–19 స్పెషలాఫీసర్‌ విజయానంద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్‌–19 స్పెషల్‌ ఆస్పత్రులను రోజు డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేయాలన్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లు ఇస్తూ...వైద్యులు, సిబ్బందిలో ధైర్యం నింపాలని సూచించారు. జిల్లాలోని కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  


ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌ 
అనంతపురం: జిల్లాలో మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా సర్వజనాస్పత్రిలో పనిచేసే ఓ వైద్యురాలు, మెడికల్‌ కళాశాలలో పనిచేసే మరో వైద్యురాలితో పాటు హిందూపురంలో నివాసముంటున్న ఓ తహసీల్దార్, హిందూపురానికే చెందిన మరో ముగ్గురు కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరిందన్నారు.

సర్వజనాస్పత్రిలో కళ్యాణదుర్గానికి చెందిన ఓ వృద్ధుడి(70)కి వైద్యురాలు(32) సేవలందించారని, ఈ క్రమంలో వైద్యురాలికి వైరస్‌ సోకిందన్నారు. ఇక వైద్య కళాశాల వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లోని ఓ మైక్రోబయాలజిస్టు(35), హిందూపురం పూలకుంట పంచాయతీ పరిధిలో నివాసమున్న తహసీల్దార్‌(48), మరో వ్యక్తి(49), ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన హిందూపురానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి, ఇప్పటికే కరోనా బారిన పడిన అంబులెన్స్‌ డ్రైవర్‌తో సన్నిహితంగా మెలిగిన 21 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆరు పాజిటివ్‌ కేసులు రాగా.. హిందూపురానికి చెందినవే నాలుగు ఉన్నాయన్నారు. అంతకుముందు కలెక్టర్‌ కిమ్స్‌ సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు.  

మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం 
మీరందరికీ నిష్ణాతులైన వైద్యులతో చికిత్సలందిస్తున్నాం. త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రభుత్వం తరఫున అన్నివిధాల అండగా నిలుస్తాం. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం. వైద్యులు చెప్పినట్లు నడుచుకుంటే మీరంతా త్వరలోనే మీ ఇళ్లకు వెళ్తారు. 
– కిమ్స్‌ సవీరాలోని కరోనా బాధితులతో కలెక్టర్‌ గంధం చంద్రుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement