ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో కరోనా మృతులు రెండుకు చేరాయి. ఢిల్లీ నుంచి మత ప్రార్థనల నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చిన వ్యక్తి కరోనా సోకి మృతి చెందాడు. ఢిల్లీ నుంచి నెల్లూరుకు వచ్చిన వారిని గుర్తించి కొంత మందిని ఈ నెల 10న క్వారంటైన్‌కు తరలించారు. అదే రోజు ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన 56 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో పెద్దాస్పత్రి కరోనా వార్డులో చేరాడు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. అతని రక్త నమూనాల రిపోర్టు 13వ తేదీ రాగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని భౌతికకాయాన్ని 14వ తేదీ రెవెన్యూ శాఖకు అప్పగించారు. నిబంధనల మేరకు అతని అంత్యక్రియలను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి బుధవారం తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీకి చెందిన వ్యక్తి ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు, ఆ కాంటాక్ట్ అయిన వారు ఎవరిని కలిశారో వివరాలు సేకరించి వారందరిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కరోనాతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ది తొలి మరణం కాగా ఇది రెండోదిగా నమోదైంది. ఇదిలా ఉండగా బుధవారం జిల్లాలో మరో రెండు కొత్త కేసులు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు వాకాడు మండలం తిరుమూరు గ్రామానికి చెందిన వారు కాగా మరొకరు నెల్లూరు మూలపేట ప్రాంతానికి చెందిన వారు.
వీరిద్దరితో కలిపి మొత్తం 58 మందికి కరోనా పాజిటివ్ సోకింది. ఇందులో ఒకరు మరణించగా మరొకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు క్రమేపి జిల్లాలో పెరుగుతున్నాయి. వైద్యశాఖాధికారులు, పంచాయతీరాజ్‌శాఖ, మున్సిపల్, పోలీసుశాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు లాక్‌డౌన్ కాలంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వాకాడు మండలంలో ఏడుకు చేరిన పాజిటివ్ కేసులు
వాకాడు: మండలం తిరుమూరులో బుధవారం మరో కరోనా పాటిజివ్ కేసు నమోదైంది. ఇప్పటికే మండలంలో ఆరు పాజిటివ్ కేసులు ఉండగా, తాజాగా ఆ సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటి వరకు నవాబుపేటలో 3, తిరుమూరులో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీఎస్‌యూకు సెలవులు పొడిగింపు
వెంకటాచలం: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విక్రమ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు, కావలి పీజీ సెంటర్ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు వీఎస్‌యూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీఎస్‌యూ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాల్లో జరగాలి్సన అన్నీ పరీక్షలను కూడా వాయిదా వేసిన్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రారంభమైన తరువాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment