సాక్షి, తిరుమల: ప్రాణాంతక కరోనా నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ పాలక మండలి ఏప్రిల్ 14 వరకు రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేశామని తెలిపింది. ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని టీడీడీ పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
(చదవండి: 128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం)
ఇదిలాఉండగా.. అనాథలు, నిరుపేదలను ఆదుకొనేందుకు టీటీడీ ముందుకొచ్చింది. రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది. ఇక ఆలయ పెద్ద జీయర్ మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆరిపోలేదు. స్వామివారి కైంకర్యాలు ఆగమ శాస్త్ర పరంగా నిత్యం కొనసాగుతున్నాయి. తిరుమల వెంకన్నకు అర్చకులు నిత్యనైవేద్యాలు అందిస్తున్నారు. శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి అన్నారు. కాగా, శ్రీవారి దర్శనాలు రద్దుచేసి నేటికి పదిరోజులు కావడంతో తిరుమల నిర్మానుష్యంగా మారింది.
(చదవండి: కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం)
Comments
Please login to add a commentAdd a comment