
నిర్మానుష్యంగా ఉన్న విజయవాడ చిట్టినగర్ మెయిన్ రోడ్డు
సాక్షి, కృష్ణా: జిల్లాలో కరోనా కలవరం కొనసాగుతోంది. శనివారం ఏకంగా మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాలో విజయవాడ, కానూరు, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం పట్టణాల్లోని కరోనా బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో యాంటీ వైరస్ రసాయనాలను పిచికారీ చేయించారు. మూడు రోజుల్లో 26 మంది ఐసోలేషన్ కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. (లాక్ డౌన్ ముగిశాకే ‘టెన్త్’పై నిర్ణయం)
మూడు రోజుల్లో 26 మంది
వియజవాడలోని ఐసోలేషన్ కేంద్రానికి వచ్చారు. వీరందరినీ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు, గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ రోగుల ఆరోగ్యం స్థిరంగా ఉంటే పిన్నమనేని సిద్ధార్థ వైద్య కశాశాలలో, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ చికిత్స అవసరమైనా, వెంటిలేటర్ సపోర్టు కావాల్సి వచ్చినా బాధితులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
సంక్రమణ చెందకుండా..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమక్రమంగా విస్తరిస్తోంది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోనూ కరోనా సంక్రమణ చెందకుండా కఠినమైన చర్యల్ని తీసుకునేలా యంత్రాంగం అడుగులేస్తోంది. విజయవాడ ఐసోలేషన్‌లో 14 రోజుల పరిశీలన, పరీక్షల తరువాత ఒక యువకుడిని శనివారం ఇంటికి పంపించిన అధికారులు ఇదే తరహాలో ఢిల్లీ వారి విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అనుమానం ఉన్న వారిని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకొచ్చి ముందస్తు పరీక్షలు నిర్వహించేలా చూస్తున్నారు. విజయవాడ నగరంలో వ్యాధి నివారణ దిశగా ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పక్కగా అమలు చేయడంతో పాటు వ్యాపారులు సహా ఇతర దుకాణాల సమయపాలన విషయంలో కచ్చితమైన నిబంధనల్ని పాటిస్తున్నారు.
ప్రభుత్వ సూచనలు పాటించాలి
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా వైరస్‌పై విజయం సాధించవచ్చని కరోనాను జయించిన యువకుడు పేర్కొన్నారు. పారిస్ నుంచి వచ్చిన విజయవాడ పాతబస్తీ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రభుత్వాస్పత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది కోలుకున్నాడు. అతనికి రెండు సార్లు కరోనా పరీక్ష నిర్వహించగా, నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోతురాజు నాంచారయ్య, పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.గోపీచంద్ తెలిపారు. కలెక్టర్ అభినందనలు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన యువకుడిని కలెక్టర్ ఏంఎండీ ఇంతియాజ్ అభినందించారు.
కరోనాను జయించిన యువకుడికి వైద్యు లు, వైద్య సిబ్బంది హర్షధ్వానాల మధ్య కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోతురాజు నాంచారయ్య, పల్మ నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.గోపీచంద్, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జి.చక్రధర్‌రావు తదితరులు ఉన్నారు.