ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలోనూ ప్రబలుతోంది. ఈ కోవిడ్ లింక్‌ను తెంచేందుకు జిల్లా యంత్రాంగం అవిరళ కృషి చేస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేసేలా అడుగులు వేస్తోంది. విస్తృతంగా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి సత్వరమే రోగులను గుర్తిస్తోంది. ఐసొలేషన్ వార్డుల్లో మెరుగైన చికిత్స అందించి వారు త్వరగా కోలుకునేలా చేసి ఇంటికి పంపుతోంది. కాంటాక్ట్ కేసులను గుర్తించి క్వారంటైన్ చేయడం, పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయడం, వైరస్ కట్టడి చర్యలు చేపట్టడం ఇలా పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది.
నెల్లూరు (అర్బన్): జిల్లాలో మార్చి నెల 9న తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత రెండు వారాల వరకు పెద్దగా కేసులు నమోదు కాలేదు. లాక్‌డౌన్ అమలు తర్వాత నుంచి రోజు రోజుకూ కరోనా కేసులు ప్రబలాయి.
♦ మొదట్లో కోవిడ్ పరీక్షలు నిర్ధారించాలంటే రోగి శాంపిల్స్ తిరుపతిలోని స్విమ్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించి ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్ధారించే వారు.
♦ రాష్ట్రంలో కేసుల సంఖ్య కొంత మేరకు పెరిగే సరికి తిరుపతి నుంచి నెల్లూరుకు ల్యాబ్ రిపోర్టులు రావడంలో నాలుగైదు, రోజులు సమయం పట్టేది.
♦ ఈ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.
♦ గత నెల 21వ తేదీ నుంచి నెల్లూరులోనే పీసీఆర్ పద్ధతిలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వేగంగా ఫలితాలు వస్తున్నాయి.
♦ ఇవి కాకుండా ట్రూనాట్ విధానంలో కూడా పరీక్షలు చేసి కరోనాని నిర్ధారిస్తున్నారు.
♦ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా వివిధ పద్ధతుల్లో ఇప్పటి వరకు సుమారు 40 వేల పరీక్షలు నిర్వహించారు. 286 మంది పాజిటివ్ బాధితులను గుర్తించి వైద్య సేవలు అందించారు. అందులో 204 మంది కోలుకోవడంతో డిశ్చార్జి కూడా చేశారు.
పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు
జిల్లాలో పరీక్షలు చేసే సంఖ్య గత వారం నుంచి పెరిగింది. ఇప్పటికే జిల్లాలో పెద్దాస్పత్రి, నారాయణ ఆస్పత్రుల్లో స్వాబ్ పరీక్షలు చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో ఫైనల్‌గా నిర్ధారించే పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. జూన్ 2వ తేదీ నాటికి 10,617 మందికి పీసీఆర్ పద్ధతిలో, 17,912 మందికి ట్రూనాట్ విధానంలో పరీక్షలు చేశారు. శుక్రవారానికి మొత్తంగా సుమారు 30 వేల మంది వరకు పరీక్షలు చేశారు. ఇవి కాక యాంటీ బాడీస్, సీబీనాట్, క్లియా తదితర పద్ధతుల్లో మరో 10 వేల మందికి పరీక్షలు చేశారు.
జిల్లా అంతటా విస్తృతంగా పరీక్షలు
♦ ఇప్పటి వరకు చేసే పరీక్షలతో పాటు కొత్తగా జిల్లా అంతటా విస్తృతంగా స్వాబ్ తీసి పరీక్షలు చేసేందుకు మూడు రోజుల క్రితం నుంచే వైద్యశాఖాధికారులు ప్రణాళికను అమలు చేస్తున్నారు.
♦ ఈ ప్రణాళికలో భాగంగా 15 విభాగాలుగా నిర్ణయించి ఆయా వర్గాల వారి నుంచి ప్రతి డివిజన్‌కు 290 మందికి ప్రతి రోజు పరీక్షలు చేస్తున్నారు.
♦ ఇప్పటికే నాయుడుపేట, గూడూరు, కావలి డివిజన్లలో పరీక్షలు జరిగాయి. ఆత్మకూరు, నెల్లూరు డివిజన్‌లలో జరగాల్సి ఉంది.
♦ డివిజన్ల వారీగా పూర్తయ్యాక జిల్లాలోని 14 సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్యకేంద్రాలు), 35 పీహెచ్‌సీలు, 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజు పరీక్షలు చేస్తారు.
అప్రమత్తంగా అధికార యంత్రాంగం
వైద్యశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే త్వరలోనే కోవిడ్ పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 286కి చేరింది. పాజిటివ్ వచ్చిన చోట మాత్రమే కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మిగతా చోట్ల యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఎక్కువగా పరీక్షలు చేస్తున్నాం
జిల్లాలో వీలైంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. మొదట్లో రోజుకు పది నుంచి 20 మందికి మాత్రమే పరీక్షలు జరిగేవి. ఇప్పుడు 1,000 నుంచి 1,200 మందికి ట్రూనాట్, పీసీఆర్ పద్ధతిలో ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని మరింత ఎక్కువ మందికి నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. తద్వారా కరోనా ఉన్న వారిని సకాలంలో గుర్తించి, వారిని వేరు చేయడం ద్వారా కోవిడ్‌ను నియంత్రిస్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తే త్వరగా కరోనాను కట్టడి చేయొచ్చు. – ఎస్.రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment