కరోనా: రహస్యంగా వస్తున్న వలస మత్స్యకారులు   | Coronavirus: Migrant Fishermen Enter Into Srikakulam District | Sakshi
Sakshi News home page

కరోనా: రహస్యంగా వస్తున్న వలస మత్స్యకారులు  

Published Thu, Apr 16 2020 10:42 AM | Last Updated on Thu, Apr 16 2020 10:43 AM

Coronavirus: Migrant Fishermen Enter Into  Srikakulam District - Sakshi

మత్స్యకార గ్రామాల్లో పోలీసు గస్తీ

సాక్షి, శ్రీకాకుళం: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు అధికార యంత్రాంగం సక్సెస్‌ అయింది. ఈ విషయంలో జిల్లా ప్రజల భాగస్వామ్యం ఎంతైనా ఉంది. అధికారుల కృషికి ప్రజల సహకారం తోడవడంతో కరోనాకు దూరంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలసదారులు సవాల్‌గా పరిణమించారు. రహస్యంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా చేపల వేట కోసమని, పొట్ట కూటి కోసమని గుజరాత్, మహరాష్ట్ర, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లిన వారంతా ప్రశ్నార్ధకంగా మారారు. దాదాపు 10 వేలమంది జిల్లా మత్స్యకారులు ఆ ప్రాంతాలకు వలస వెళ్లిన వారున్నారు. అక్కడ కరోనా వైరస్‌ పెద్ద ఎత్తున ప్రబలడంతో వలస మత్స్యకారులంతా భయంతో వణికిపోయి అనధికారికంగా సముద్ర మార్గం ద్వారా జిల్లాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పడవకు 12మంది చొప్పున వస్తున్నట్టు భోగట్టా. సోంపేట మండలం గొల్లగండికి చెందిన 10మంది ఒకే బోటులో అక్కడి నుంచి వస్తున్నట్టు నిఘా వ్యవస్థ సమాచారం అందించింది. బుధవారం రాత్రికే జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వచ్చిన వెంటనే వారిపై కేసు నమోదు చేసి, క్వారంటైన్‌లో పెట్టడానికి అధికార యంత్రాంగం నిర్ణయించింది. వచ్చేవాళ్లు అధికారిక సమాచారమిచ్చి వచ్చినట్టయితే ఇబ్బంది ఉండేది కాదు. వచ్చిన వారందరికీ పరీక్షలు చేసి, అవసరమైతే క్వారంటైన్‌లో పెట్టి వారితోపాటు జిల్లా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా వ్యవహరించడం లేదు. రహస్యంగా వచ్చేస్తుండటంతో అటు అధికారులు, ఇటు పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.  

జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది 
పొట్టకూటి కోసం వలస వెళ్లడం తప్పు కాదు. ప్రాణభయంతో స్వస్థలానికి రావడం అంతకన్నా తప్పు కాదు. కాకపోతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత దూరం నుంచి అనధికారికంగా పడవల ద్వారా సముద్రమార్గం నుంచి రావడమే ప్రమాదంగా భావిస్తున్నారు. వలస వెళ్లిన మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో రాకపోకలు సాగించడం అంత మంచిది కాదు. ఎలాగూ, వీరిని తీసుకెళ్లిన మధ్యవర్తులు ఉంటారు.

వారే ప్రత్యేకంగా షెల్టర్‌ తీసుకుని అక్కడే సురక్షితంగా ఉంటే మంచిది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలు, మత్స్యకారులను ప్రత్యేకంగా ఆదుకుంటున్నాయి. పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఒకవేళ ఆయా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మన అధికారులకు సమాచారమిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆయా ప్రభుత్వాలతో మాట్లాడించి పునరావాస, సహాయ చర్యలు అందేలా చేయడానికి అవకాశం ఉంటుంది. 

దుస్సాహసం వద్దు..
మహరాష్ట్ర, గుజరాత్, చెన్నై వలస వెళ్లిన మత్స్యకారుల్లో కొందరు అక్కడుంటే కరోనా వచ్చేస్తుందనే ప్రాణభయంతో ఎలాగైనా సొంత జిల్లాకు వచ్చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు, పోలాకి, గార, ఎచ్చెర్ల మండలాలకు చెందిన వారంతా ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. జిల్లాకు వచ్చేస్తే కరోనా బారి నుంచి బయటపడొచ్చని అక్కడ ప్రైవేటు పడవలు కొనుగోలు చేసి, సరిపడా నిత్యావసర సరుకులు, డీజిల్‌ సమకూర్చుకుని, నాలుగైదు రోజుల పాటు సముద్రమార్గంగా ప్రయాణిస్తూ జిల్లాకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇలా రావడం మరింత రిస్క్‌.

సాధారణ రోజుల్లో షిప్‌లు ఎక్కువగా ఉంటాయి. వాటి పర్యవేక్షణ కూడా ఉంటుంది. పడవలకు ప్రమాదం ఏర్పడితే వెంటనే అప్రమత్తమై కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేదు. చేపల వేట నిషేధం కారణంగా దాదాపు అన్నీ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో అనుకోని ప్రమాదాలు జరిగితే మరింత మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది. ఈ ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా సదరు మత్స్యకారులు ఆగడం లేదు. జిల్లాకు రావడానికే ప్రయతి్నస్తున్నారు.

సమాచారం ఉంది  
గుజరాత్, మహరాష్ట్ర, చెన్నై నుంచి మత్స్యకారులు ప్రైవేటు బోట్ల ద్వారా వస్తున్నట్టు సమా చారం ఉంది. కానీ అది నేరం. అలా రావడం ప్రమాదకరం కూడా. ఏదైనా జరిగితే రక్షించే పరిస్థితి ఉండదు. మత్స్యకారులు వస్తున్నారన్న సమాచారం రావడంతో మెరైన్‌తోపాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కోస్ట్‌గార్డు కు సమాచారం ఇచ్చాం. సముద్రంలోనే వారిని అడ్డుకోవాలని కోరాం. ఇలాంటి రాకపోకలను నియంత్రించేందుకు నేవీకి కూడా లేఖ రాస్తున్నాను. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం 

కేసు నమోదు చేసి క్వారంటైన్‌లో పెడతాం 
ఇతర రాష్ట్రాలకు వెళ్లిన మత్స్యకారులు జిల్లాకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉంది. ముఖ్యంగా సోంపేట మండలం గొల్లగండికి చెందిన 10మంది ప్రత్యేక బోటులో బుధవారం రాత్రికి వస్తున్నట్టు తెలిసింది. అందర్నీ అలెర్ట్‌ చేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా వస్తుండటంతో వారిపై కేసు నమోదు చేసి, క్వారంటైన్‌లో పెడతాం. ఇతర ప్రాంతాల నుంచి అటు సముద్ర మార్గం, ఇటు రోడ్డు మార్గంగుండా వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం.  – ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement