సాక్షి, అమరావతి: గడిచిన 33 రోజుల్లో ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. ఏప్రిల్ 13న కనిష్టంగా 16 కేసులు, ఆ తర్వాత రోజుకు 30 కేసులకు పైనే నమోదవుతూ వచ్చాయి. ఏప్రిల్ చివరి వారంలో మాత్రం రోజుకు 70 నుంచి 80 కూడా నమోదయ్యాయి. తాజాగా ఆదివారం 25 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏప్రిల్ 30 వరకూ ఉధృతంగానే కొనసాగిన కరోనా వైరస్.. ఆ తర్వాత మే ఒకటో తేదీ నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది.
ఢిల్లీ నుంచి వచ్చిన కేసుల అనంతరం ఇప్పుడు కోయంబేడు ప్రభావం ఎక్కువగా ఉంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గడిచిన 10 రోజులుగా పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రోజూ వందల్లో నమోదవుతున్నాయి. ఒక్క ఏపీలోనే కేసులు తగ్గుముఖం పట్టినట్టు.. నమోదవుతున్న కేసుల్ని బట్టి తేలింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
దేశంలో అలా.. రాష్ట్రంలో ఇలా...
– దేశంలో ఆదివారం ఒక్కరోజే 4,853 కేసులు నమోదయ్యాయి.
– ఏపీలో మాత్రం కేవలం 25 పాటివ్ కేసులే తేలాయి.
– దీన్నిబట్టి దేశవ్యాప్త సగటులో చూస్తే మన రాష్ట్రంలో పాజిటివ్ రేటు కేవలం 0.51 శాతమే.
– దేశంలో ఇప్పటివరకూ 90,648 కేసులు నమోదయ్యాయి.
– రాష్ట్రంలో 2,380 పాజిటివ్‌లుగా నిర్థారించారు.
– ఈ లెక్కన దేశవ్యాప్త కేసుల్లో ఏపీ భాగస్వామ్యం కేవలం 2.6 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది.
– 30,706 పాజిటివ్ కేసులతో దేశంలోనే 33.87 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
ఇన్ఫెక్షన్ రేటు 1 శాతం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. నమోదవుతున్న కేసులు పాత క్లస్టర్లకే పరిమితమవుతుండగా, అందులోనూ కోయంబేడుకు సంబంధించిన కేసులే అత్యధికంగా ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు మొత్తం 9,980 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటిలో ఐదు కేసులు కోయంబేడుకు చెందినవి కాగా, మిగిలిన 21 కేసులు పాత క్లస్టర్లు, క్వారంటైన్ కేంద్రాలకు సంబంధించినవి.
► రికవరీ రేటు భారీగా పెరుగుతుండగా, పాజిటివిటీ రేటు ఒక శాతానికి పడిపోవడం వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
► ఆదివారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,380కు చేరింది.
► కరోనా నుంచి కోలుకున్న 103 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,456గా ఉంది.
► దేశవ్యాప్తంగా సగటు రికవరీ రేటు 37.75 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో 61.18 శాతానికి చేరింది.
► మొత్తం మరణాల సంఖ్య 50కు చేరగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 747 ఉన్నాయి.
► ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 2,38,998కు చేరడమే కాకుండా, ప్రతి పది లక్షల జనాభాకు సగటున 4,476 మందికి పరీక్షలు చేయడం ద్వారా దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 150 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్థారణ కాగా, వారిలో గుజరాత్ నుంచి వచ్చిన 23 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం వలస కూలీల యాక్టివ్ కేసుల సంఖ్య 127కు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment