లాక్ డౌన్ నేపథ్యంలో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రకాశం బ్యారేజ్
సాక్షి, అమరావతి: జిల్లాలో ‘ఢిల్లీ’ కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 23కు చేరడం.. అది కూడా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికే నిర్ధారణ కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. మరోవైపు ఇటీవల చనిపోయిన విజయవాడకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ అని వెల్లడి కావడంతో ఆందోళన తారస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన వారంతా గత నెల 17, 18 తేదీల్లో జిల్లాకు రావడంతో అప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారనే విషయాన్ని పోలీసులు, అధికార యంత్రాంగం రాబడుతోంది. వీరు సంచరించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులు ఇప్పటికే దాదాపు 135 మందిని అనుమానితులుగా గుర్తించి వీరందరినీ విజయవాడలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్, ఆర్టీసీ ఆస్పత్రి, సెంటినీ, వైవీ రావు, లిబర్టీ, గన్నవరం వెటర్నీ కళాశాల, గంగూరులోని క్వారంటైన్ సెంటర్‌లకు పంపించారు.
హాట్‌స్పాట్లుగా బాధితులున్న ప్రాంతాలు..
కరోనా పాజిటివ్ బాధితులు నివాసముంటున్న పరిసర ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. విజయవాడ నగరంలోని ఓల్డ్ రాజరాజేశ్వరీపేటతోపాటు, కుమ్మరిపాలెం, జగ్గయ్యపేట పట్టణం, నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం ముప్పాల గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. అక్కడివారు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా.. అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తొలిదశలో బాధితుల కుటుంబ సభ్యులు, వారి సన్నిహిత బంధువులను క్వారంటైన్‌కు తరలించిన అనంతరం ఆ వర్గానికి చెందిన మత పెద్దలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో అధికారులు, పోలీసులు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. విజయవాడ నగరంలో హాట్‌స్పాట్లుగా గుర్తించిన ఓల్డ్ రాజరాజేశ్వరీపేటతోపాటు, కుమ్మరిపాలెం ప్రాంతాలలో తాజాగా మరికొన్ని కేసులు పాజిటివ్‌గా తేలడంతో ఈ ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు. ఇక నరగంలోనూ గతం కన్నా భిన్నంగా మరిన్ని ఆంక్షలు అన్ని చోట్ల కనిపించే వీలుంది.
కంటైన్మెంట్ జోన్లు ఇవే..
జిల్లా వ్యాప్తంగా విదేశాల నుంచి, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. విజయవాడలో కృష్ణలంక, భవానీపురం, శాంతినగర్(నున్న), కేదారేశ్వరీపేట, మొగల్రాజపురం, సనత్ నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా వాసుల కలవరం..
ఢిల్లో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందిలో ఈ వ్యాధి ఉన్నట్లు వెల్లడవడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. జిల్లా నుంచి మొత్తంగా 52 మంది ఢిల్లీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇటీవల హుటాహుటిన వారిని గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. గుర్తించిన అనుమానితుల నమూనాలను ల్యాబ్‌కు పంపించగా 10 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు వారి స్వస్థలాల్లో సంచరించడం.. అదే సమ యంలో వారితో దగ్గరగా ఉన్న వారికి, సంబం«దీకులకు కూడా కరోనా పాజిటివ్ లక్షనాలున్నట్లు తేలడంతో ఒక్క సారిగా జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
బెజవాడలో స్వచ్ఛందంగా 67 మంది క్వారంటైన్‌కు..
ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు, వారి సంబంధీకులను గత నాలుగు రోజులుగా 213 మందిని గుర్తించిన పోలీసులు విజయవాడ, సమీప ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఖ్య మరింత ఉండొచ్చని భావించిన నగర సీపీ ద్వారకా తిరుమలరావు, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి.. స్వచ్ఛందంగా క్వారంటైన్ రావలని పిలుపునివ్వడంతో గురువారం ఒక్కరోజే 67 మంది క్వారంటైన్‌కు వచ్చారు. విద్యాధరపురం గుప్తా సెంటర్‌కు చెందిన వీరిని రెండు ఆర్టీసీ బస్సులలో కంకిపాడులోని శ్రీచైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు భవానీపురం పీఎస్ సీఐ డీకేఎన్ మోహన్‌రెడ్డి తెలిపారు.
ముందుకు రండి..
కరోనా పాజిటివ్ వ్యక్తులను కలిసిన వారు, సన్నిహితులు, సంబం«దీకులు క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా రావాలి. తప్పించుకుని తిరుగుతున్న వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగానే భావిస్తున్నాం. కాబట్టి వారు క్వారంటైన్ రావడం వల్ల.. వారితోపాటు వారుంటున్న ప్రాంత ప్రజల్ని రక్షించించుకున్నట్లే.
– ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment