సాక్షి, కృష్ణా: విజయవాడ నగరంలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. వీఎంసీ ప్రాంతంలో తాజాగా 15 మందికి కరోనా నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో కరోనా సోకిన కుటుంబ సభ్యులు, బంధువులే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురికి..
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని కృష్ణలంకలో మరో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకే కుటుంబంలో దంపతులతోపాటు వారి కూతురికి కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో ఇద్దరు యువతులకు, భవానీపురం ఒకరికి, కొత్తపేటలో మరొకరికి వైరస్ సోకింది.
కరోనా కట్టడికి సమన్వయంతో పనిచేయాలి
మచిలీపట్నం: కరోనా కట్టడికి యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేయాలని కోవిడ్–19 కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ వివేక్ ఆదిష్, డాక్టర్ రుచి గేలాంగ్ సూచించారు. కోవిడ్ నియంత్రణ చర్యల పనితీరుపై కేంద్ర బృందం మచిలీపట్నంలో సోమవారం పర్యటించింది. తొలుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సందర్శించి వైద్య, మున్సిపల్, పోలీసు అధికారులతో సమీక్షించారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై డివిజన్ నోడల్ అధికారి డాక్టర్ వై బాలసుబ్రహ్మణ్యం బృంద సభ్యులకు వివరించారు. మచిలీపట్నంలో ఇప్పటి వరకు 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరింత మందికి వ్యాప్తి చెందకుండా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను సకాలంలో గుర్తించి క్వారంటైన్ చేశామని తెలిపారు. రెడ్‌జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో పాలు, కూరగాయలు, నిత్యావసరాలను వాహనాల ద్వారా ఇళ్లకే సరఫరా చేస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు.
మచిలీపట్నంలో డ్రోన్ కెమెరా ద్వారా లాక్‌డౌన్‌ను పరిశీలిస్తున్న కోవిడ్–19 కేంద్ర బృందం సభ్యులు
వివరాలు సేకరించిన బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో అమలు తీరును పరిశీలించేందుకు నగరంలోని రెడ్‌జోన్‌గా గుర్తించిన గాంధీనగర్ కాలనీలో పర్యటించారు. డ్రోన్ కెమెరాతో లాక్‌డౌన్ అమలు తీరు ఎలా ఉందనేది పరిశీలించారు. అనంతరం చిలకలపూడి వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. క్వారంటైన్‌లో ఉంటున్న వారితో మాట్లాడి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి, పాజిటివ్ కేసుల గుర్తింపునకు సంబంధించి పరీక్షల తీరు ఎలా ఉందనేది పరిశీలించారు. ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు వెయ్యికి పైగా కరోనా టెస్టులు నిర్వహించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంజీనాయక్ వివరించారు. పీపీఈ కిట్లు, మాస్కులు కొరత లేకుండా తగిన నిల్వలు ఉంచామన్నారు. పర్యటనలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టల్ లక్ష్మీబాల, పీఓ డీటీటీ డాక్టర్ అమృత, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, చిలకలపూడి సీఐ వెంకటనారాయణ, తహసీల్దార్ సునీల్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment