విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణంధర్మశ్రీ తన కుమార్తె సుమకు ఏప్రిల్ 4న విశాఖ సాగర తీరంలో వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల ఆ పెళ్లిని నవంబర్‌కు మార్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఆలీ కుమారుడికి ఏప్రిల్ 14న పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో ఆయన తన కొడుకు పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు.
సాక్షి, అమరావతి బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కరోనా వైరస్ పెళ్లిళ్ల వాయిదాకు కారణమవుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జనం ఒకచోట గుమిగూడకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో వివాహాలు జరిపించటానికి వీలు లేకుండా పోయింది. సాధారణంగా హిందువులు ఫాల్గుణ, ఛైత్ర, వైశాఖ మాసాల్లో వివాహాలకు సుముహూర్తాలు నిశ్చయిస్తుంటారు. ఏడాది మొత్తమ్మీద ఈ మూడు నెలల్లో 50 వేల నుంచి 60 వేల వరకు పెళ్లిళ్లు జరుగుతాయి.
మార్చి 25 నుంచీ..
► ఈ ఏడాది మార్చి 25 నుంచి ఛైత్రమాసం ప్రారంభమైంది. ఏప్రిల్ 4, 8, 9, 11, 14, 16, 17, 30 తేదీలు, మే 1న పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి.
► ఈ తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిపించడానికి రెండు, మూడు నెలల ముందే ముహూర్తాలు నిశ్చయించుకున్నారు.
► కొందరు ఇప్పటికే శుభలేఖలు పంపిణీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
► ఇంతలో మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
► ఏప్రిల్ 14 తర్వాత ఎలాంటి పరిస్థితులుంటాయో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
► దీంతో ఇప్పటికే నిశ్చయించిన ముహూర్తాల్లో 95 శాతానికి పైగా వివాహాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
► లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో వివాహాలు జరిపించాలనే ఆలోచనలో కొందరు ఉన్నారు.
► మే 22 నుంచి జ్యేష్ట మాసం, అనంతరం వచ్చే ఆషాఢ మాసం వివాహాలకు ముహూర్తాలుండవు.
► ఆగస్టు (శ్రావణం), నవంబర్ (కార్తీకం) నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో చాలామంది అప్పటికి వాయిదా వేసుకుంటున్నారని పురోహితులు అంటున్నారు.
వీళ్లంతా ఖాళీనే..
ముందుగానే బుక్ చేసుకున్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలను కూడా రద్దు చేసుకుంటున్నారు. పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, సన్నాయి, బ్యాండ్ మేళం, మ్యారేజ్ ఈవెంట్ల నిర్వాహకులు.. ఇలా అందరూ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉంటున్నారు.
కొద్దిగంటల్లో పెళ్లి.. మే నెలకు వాయిదా
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరులోని లావేటి వీధిలో సోమవారం జరగాల్సిన వివాహం లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా నిలిచిపోయింది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అందటంతో తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణ అక్కడికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. కరోనా వైరస్ తీవ్రతపై వధూవరుల కుటుంబాల వారికి అవగాహన కల్పించడంతో వివాహాన్ని మే నెలకు వాయిదా వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment