ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందే నా పాట | Coronavirus Song Constable KTV Ramesh Interview At Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందే నా పాట

Published Tue, May 12 2020 7:32 AM | Last Updated on Tue, May 12 2020 7:58 AM

Coronavirus Song Constable KTV Ramesh Interview At Visakhapatnam - Sakshi

కేటీవీ రమేష్‌  

సీతమ్మధార (విశాఖఉత్తర): ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే చాలా మంది ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఓ కానిస్టేబుల్‌ ఆవేదన చెందాడు. ఆ ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సీపీ నుంచి డీజీపీ వరకూ...అక్కడ నుంచి సీఎం వరకూ ఈ పాట చేరింది. శాంతిభద్రతలే కాదు..ప్రజలకు అవగాహన కూడా కల్పించడానికి తన ప్రతిభను చాటుకున్నాడు కానిస్టేబుల్‌ కేటీవీ రమేష్‌. ‘ఇది ఒక యుద్ధం.. ఇదే ఆయుధం’ అంటూ ఫోర్త్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌ (పీసీ నంబర్‌ 1068–2009 బ్యాచ్‌) కేటీవీ రమేష్‌ ఓ పాట పాడారు. పాట రాసి, ట్యూన్‌ కట్టింది కూడా ఆయనే. ఈ సందర్భంగా పాట రాసి దాన్ని యూట్యూబ్‌లో సంచలనం అయ్యేవరకు జరిగిన జర్నీ ఆయన మాటల్లోనే... 

మిత్రుల సాయంతో.. 
ఫోర్త్‌ టౌన్‌ పరిధి రెడ్‌ జోన్‌లో ఉంది. విధులు నిర్వర్తిస్తూనే ఈ పాటరాశా..ముందుగా భీమిలి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న నా మిత్రుడు జయకృష్ణతో ఈ విషయం చెప్పా. దీంతో నా మిత్రుడు గోపాలపట్నంలో ఉన్న హిప్‌ గ్రేడ్‌ డిజిటల్‌ రికార్డింగ్‌ స్టూడియో అధినేత శామ్యూల్‌ను ఫోన్‌లోనే పరిచయం చేశాడు. పాట పాడి వాట్సప్‌లో ఆయన సెండ్‌ చేశా. దీనికి ఆయన మ్యూజిక్‌ సమకూర్చారు.

రికార్డ్‌ చేసిన పాటను ఏసీపీ కులశేఖర్‌ ద్వారా స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు సాయంతో సీపీ ఆర్కే మీనా దగ్గరకు తీసుకువెళ్లారు. పాట విని ఆయన మెచ్చుకున్నారు. వీడియో రూపంలో మంచి ఆల్బబ్‌ చేయాలని సూచించారు. సీపీ ఆదేశాల మేరకు వీడియో రూపకల్పన చేశా. సీపీ మీనా ప్రోత్సాహం మరింత బలాన్నిచ్చింది. దీంతో పాట రూపకల్పన జరిగింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌  ఎస్‌.హేమంత్‌ కొరియాగ్రాఫర్‌గా, వీడియో మేకింగ్‌ సంతోష్‌ యడ్లపల్లి చేశారు.

పాటలంటే ఇష్టం
పాటలంటే చాలా ఇష్టం. సినిమా పాటలు హమ్‌ చేస్తుండేవాడ్ని.  ఫిబ్రవరి 14, 2018లో íసీఆర్‌íపీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడుల నేపథ్యంలో ఓ పాట పాడా. అందర్నీ వదిలేసి, విధులంటూ వెళ్లావు.. దేశం సరిహద్దుల్లో ప్రాణాలు విడిచావు అంటూ ఓ పాట పాడా. దీనిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశా. దీనికి చాలా మంది ప్రశంసించారు. 

ఆమే నాకు స్ఫూర్తి
సీఐడీ అడిషనల్‌ ఎస్పీ సరిత మేడమ్‌ కరోనా మీద పాడిన పాట విన్నా.  నేనూ ఎందుకు రాయకూడదు. బాగా వస్తే సరే..లేదంటే వదిలేద్దాం..అనుకుని ట్రై చేశా. మొత్తానికి పాట బాగా వచ్చింది. 

డీజీపీ చేతులు మీదుగా వీడియో విడుదల
వీడియో మొత్తం పూర్తయింది. మంచి క్వాలిటీతో నిర్మించాం. దీనిని సీపీ ఆర్కే మీనాకు పంపించా. ఆయన చూసి డీజీపీ గౌతం సవాంగ్‌కు పంపించారు. ఆయన వీడియో చూసి బాగా చేశాడని చెప్పారట. దీంతో డీజీపీ సీసీ గుణరాం ఫోన్‌ చేసి ‘నీ పాట బాగుంది..వెరీ గుడ్‌..డీజీపీ సార్‌ ఇంప్రెస్‌ అయ్యారు’ అని చెప్పారు. చాలా ఆనందం వేసింది. పాట చూసిన రెండ్రోజుల్లో అధికారికంగా డీజీపీ సవాంగ్‌ ఈ పాటను విడుదల చేశారు.

శామ్యూల్‌ చాలా సహకరించారు
హిప్‌ గ్రేడ్‌ డిజిటల్‌ రికార్డింగ్‌ స్టూడియో అధినేత శామ్యూల్‌ ఇంట్లోనే స్టూడియో ఉండడం లాక్‌డౌన్‌ వేళ బాగా కలిసొచ్చింది. వాట్సప్‌లో నా పాటను పంపగానే అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. కేవలం పది రోజుల్లోనే పాట పూర్తి చేశాం. సీఎం క్యాంప్‌ ఆఫీసులో కూడా వీడియో చూశారట. ప్రస్తుతం అధికారులు, ఉన్నతాధికారులు అందరూ మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. 

యూ ట్యూబ్‌లో సంచలనం
పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటి వరకూ 250కే వ్యూస్‌ లభించాయి. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. వివిధ యాప్‌లో కూడా లింక్‌ షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement