
గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచమంతటికీ పాత చుట్టమైపోయింది. లక్షల ప్రాణాలు బలిగొన్న ఈ మహమ్మారికి సంబంధించి కొత్తగా తెలిసిన విషయమేమిటంటే.. ఇది గాలి ద్వారా కూడా వ్యాపించగలదని! అమ్మో.. మరి బయటకు వెళ్లడమెలా? ఊపిరి కూడా పీల్చుకోలేమా? అన్న భయాందోళనలు వద్దు. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచం మొత్తమ్మీద ఉన్న సుమారు 239 మంది శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా గుర్తించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఆ ప్రత్యేక పరిస్థితులేమింటే..
► బహిరంగ ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాల్లేవు.
► ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లలో కొన్ని రకాల వైద్య ప్రక్రియల కారణంగా అతి సూక్ష్మమైన తుంపర్లు (ఏరోసాల్స్) వెలువడే చోట్ల వ్యాపించేందుకు అవకాశముంది.
► గాలి,వెలుతురు సక్రమంగా లేని ప్రాంతాల్లో వైరస్ గాల్లోనే ఉండిపోవడం వల్ల ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువ.
ఈ అంశంపై వీలైనంత తొందరగా ఇంకా విస్తృత పరిశోధనలు చేపట్టాల్సి ఉందని, వైరస్ వ్యాపించేందుకు గల అన్ని మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌ఓ మూడు రోజుల క్రితం జారీచేసిన ‘సైంటిఫిక్ బ్రీఫ్’లో స్పష్టంగా పేర్కొంది. ఎప్పుడు? ఎలాంటి పరిస్థితుల్లో కరోనా కారక వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడం ప్రజారోగ్య సంరక్షణకు, వ్యాధి వ్యాప్తి నిరోధానికి, నివారణకు చాలా కీలకమని స్పష్టంచేసింది. వైరస్ బారిన పడ్డవారితో సన్నిహితంగా మెలగడం, వారి ఊపిరి లేదా లాలాజలం ద్వారా ఏర్పడే తుంపర్లు వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలైనా.. కొన్ని ఇతర మార్గాల్లోనూ ఇతరులకు సోకవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment