
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కరోనా విజంభిస్తున్న నేపథ్యంలో.. రోజులు బాలేవు, ఇంట్లో నుంచి బయటకు రాకండ్రా నాయనా అని ప్రభుత్వాలు చిలక్కు చెప్పినట్లు చెప్పాయి. ఆహా.. వింటే కదా.. దర్జాగా ఏదో షికారుకు వెళ్లినట్లు బయలు దేరుతున్నారు. ఉప్పులు, పప్పులంటూ రోడ్డెక్కుతున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వారి పప్పులుడకనిస్తారా? మంచిగా చెప్తే వినేరోజులు పోయాయనుకుని లాఠీ ఝుళిపిస్తున్నారు. దెబ్బకు కుయ్యో, మొర్రో అంటూ బయట తిరుగుతున్న నిర్లక్ష్య జనాలు ఇళ్లకు పరుగెత్తుతున్నారు. అయితే "తినగ తినగ వేప తియ్యునుండు" అన్న చందంగా కొందరు దెబ్బలు తినడానికైనా రెడీ కానీ అస్తమానం ఇంట్లో ఉండటం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. (కదిలిస్తే కన్నీళ్లే!)
దీంతో అధికారులు ఇప్పుడు మరో ఉపాయాన్ని ఆలోచించి వెంటనే యముడిని రంగంలోకి దింపారు. గడప దాటకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో జనాలకు సూచనలిప్పిస్తున్నారు. యముడి వెంట చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. "మీ కర్మ ఉంటే బయటకు రండి.. సంతోషంగా ఉంటే ఇంట్లో ఉండండి. దయచేసి పోలీసుల మాటలను ఆచరించండి" అని కోరుతున్నాడు. ఇంతకీ ఈ అరుదైన దృశ్యం కర్నూలులోని డోన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఆ ప్రాంత సీఐ సుధాకర్ రెడ్డి ఈ వినూత్న ప్రచారానికి తెరదీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (అన్నం పంచే అబ్బాయి)
ఇక మరో వీడియోలో రోడ్లపై సంచరిస్తున్న ఓ వ్యక్తిని యమధర్మరాజు అడ్డంగా పట్టేసుకున్నాడు. ఈ వ్యక్తి ఎన్నిసార్లు బయట తిరిగాడంటూ చిత్రగుప్తుడిని వివరాలు కోరగా అతడు అధికారుల మాట వినడం లేదని దొంగతనంగా బయటకు వస్తున్నాడని పేర్కొన్నాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన అతన్ని నూనెలో కాల్చి వేయించాల్సిందిగా గమ్మత్తైన శిక్షను విధించాడు. ఇదిలా ఉంటే గతంలోనూ పోలీసులు వినూత్న ప్రచారాలు చేపట్టారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ బయటకు రావద్దంటూ పాటలు పాడి విన్నవించుకున్నారు. వైరస్ హెల్మెట్లు ధరించి భయపెట్టారు. అయినప్పటికీ జనాలు వారి మాటను పెడచెవిన పెడుతూ బయట విచ్చలవిడిగా తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. (డ్యూటీ కోసం వందల కిమీ నడిచిన పోలీస్)
Comments
Please login to add a commentAdd a comment