
అది కరప్షన్ గ్రిడ్..
- ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ విమర్శ
- రూ.40వేల కోట్లు ఎందుకని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అని చెప్పుకుంటున్న వాటర్‌గ్రిడ్.. టీఆర్‌ఎస్‌కు కరప్షన్‌గ్రిడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నాయకుడు కె.జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 70 శాతం గ్రామాలకు సురక్షిత తాగునీరు అందుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన గ్రామాలకు నీటిని అందించవచ్చని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, 40 వేల కోట్లతో కొత్తగా వాటర్‌గ్రిడ్ అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటివరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా తయారుచేయలేదు కానీ, టెండర్లు వేసి పంచుకోవడానికి మాత్రం అన్నీ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు.
పథకంలో 14 ప్యాకేజీలు ఉంటాయని చెప్పి ఇప్పుడు 6 ప్యాకేజీలకు ఎందుకు కుదించారని ప్రశ్నించారు. ‘లెస్’ టెండర్ పేరుతో పంచుకోవడానికే మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాటిని తగ్గించారని ఆరోపించారు. తెలంగాణ కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నా, మొత్తం వాటర్‌గ్రిడ్ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. వాటర్‌గ్రిడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ ప్రజలకోసం కాదని, మంత్రి కేటీఆర్‌కు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. కేటీఆర్ స్థాయిని, వయసును మరచి అధికార అహంకారంతో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ లాంటి జాతీయస్థాయి నాయకుడిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసులకు జానారెడ్డి నివాళి అర్పించారు.
మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ
శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని గుర్తిస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ ప్రకారం ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీ గుర్తింపును అన్ని విభాగాలను పంపించారు.
గ్రిడ్‌తో అదనపు భారం: జీవన్ రెడ్డి
వాటర్‌గ్రిడ్ పేరుతో ప్రజలపై రూ. 35 వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేవలం రూ. 2 వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి తాగు నీటిని అందించవచ్చని చెప్పారు.
టీపీసీసీలో యువరక్తం..
యువత, పార్టీకోసం పనిచేసేవారితోనే టీపీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏఐ సీసీ నేతలు కొప్పుల రాజు, జైరాం రమేశ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ కార్యవర్గం నియామకంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఒక అభిప్రాయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేయగలిగే వారినే టీపీసీసీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 60 ఏళ్లకు మించని వారినే పదవుల్లోకి తీసుకోనున్నారు. ఎక్కువగా యువతకు అవకాశం ఇవ్వాలనుకున్నా కొందరు సీనియర్లను కూడా తీసుకుంటే బాగుంటుం దనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. జిల్లాకు ఇద్దరు చొప్పున 20 మందితోనే పూర్తిస్థాయి కార్యవర్గం ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు.