
శ్రీవారి కల్యాణోత్సవాల్లో.. అవినీతి నిజమే!
తిరుపతి, న్యూస్‌లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్‌స నివేదికలో తేటతెల్లమైంది. మూడు రోజులుగా వీజీవో హనుమంతు తన సిబ్బందితో కలసి కల్యాణోత్సవ రికార్డులను పరిశీలించారు. మంగళవారం ఈవో బంగ్లాలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను వీజీవో అందజేశారు. కల్యాణోత్సవాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విచారణలో తేలినట్లు సమాచారం. శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈవో ఎంజీ.గోపాల్ విజిలెన్‌స ఇటీవల విచారణకు ఆదేశించిన విషయం విదితమే. గత ఏడాది జనవరిలో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవిదేశాల్లో 170 కల్యాణోత్సవాలను నిర్వహించినట్లు చూపించారు.
రూ.3 కోట్లకు పైగా నిధులు టీటీడీ నుంచి విడుదలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందు అడ్వాన్‌సగా తీసుకునే లక్షలాది రూపాయల్లో ఖర్చు పోను మిగిలిన మొత్తాన్ని టీటీడీ ఖాతాలోకి జమచేయడం లేదని గుర్తించారు. ముంబైలో కల్యాణోత్సవం జరిగితే తిరుపతి నుంచి వంటవారు వెళ్లినట్లు, బెంగళూరు నుంచి పూల డెకరేషన్లు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కో రకమైనƒ ఏర్పాట్లు చేసినట్టు బిల్లులు చూపించారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు శ్రీవారికి పట్టుచీరలు, ఇతర కానుకలు సమర్పిస్తుంటారు. ఇవేవీ ఖజనాకు జమచేయకుండా స్పెషలాఫీసర్ స్వాహా చేసినట్లు గుర్తించారు. టీటీడీకి సమర్పించిన బిల్లుల్లో అడ్రస్‌లు సక్రమంగా లేకపోవడంతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సమీక్షలో జేఈవో, సీవీఎస్‌వో, ఎఫ్‌అండ్‌సీవో, విజిలెన్‌స వీజీవో, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇకపై జేఈవో సమక్షంలోనే కల్యాణాలు
అక్రమాలు జరిగాయని నిర్ధారించిన టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. సమీక్షలో శ్రీకల్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషలాఫీసర్ కోరాడ రామకృష్ణను మందలించారు. ఇకపై ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా కొనసాగే అర్హత లేదన్నారు. అతని స్పెషలాఫీసర్ కాలపరిమితి మరికొంత సమయం ఉండడంతో అంతవరకు తాత్కాలికంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కల్యాణోత్సవాలు జేఈవో సమక్షంలోనే జరగాలని ఈవో ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు.