
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.
తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు షాక్..‘ఆప్’కు అఖిలేష్ మద్దతు