విప్ కూన రవికుమార్‌ను నిలదీస్తున్న ఓ మహిళ
ఇసుక ర్యాంపుల నుంచి కాంట్రాక్టు పనుల వరకూ, సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపిక నుంచి నీరు–చెట్టు పనుల వరకూ ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ తమ్ముళ్ల మధ్య వాదులాటలు మొదలయ్యాయి. ఇదెక్కడో కాదు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే! సొంత ఇలాకాలో తనకు తిరుగులేదన్న ధీమాలో ఉన్న ఆయనకు ఇప్పుడు గ్రూపు తగాదాలు తలబొప్పి కట్టిస్తున్నాయి. సొంత మండలమైన పొందూరులో అవి తారస్థాయికి చేరాయనడానికి గత వారం రోజుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. తమ మాట నెగ్గకపోతే పబ్లిక్‌లోనైనా విప్‌ను నిలదీయడానికి టీడీపీ నాయకులు వెనకాడట్లేదంటే పరిస్థితి ఊహించవచ్చు.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: పొందూరు మండలంలో రవికుమార్‌పై సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర అసమ్మతి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వకుండా రవికుమార్ తన కుటుం» సభ్యులకే కట్టబెడుతున్నారని పలువురి టీడీపీ నాయకుల వాదన. రవికుమార్ సోదరుడు కూన వెంకట సత్యారావుకే పొందూరు మండలంలో ఎక్కువ కాంట్రాక్ట్ పనులు ఇవ్వడం అందుకు బలం చేకూర్చుతోంది. పీఏసీఎస్ అధ్యక్షుడిగా కూడా తన అన్నకే పట్టం గట్టడంతో రాజకీయంగానూ తమను ఎదగనీయట్లేదని సెకండ్ క్యాడర్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ సోదరుడి వర్గానికి వ్యతిరేకంగా లోలుగు జెడ్‌పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములనాయుడు, అన్నెపు రాము, చిగిలిపల్లి రామ్మోహనరావు జతకట్టారు. కొన్ని సంవత్సరాల పాటు పార్టీలో వెంటతిరిగిన తమను పక్కనబెట్టారని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీరాములనాయుడును కాదని లోలుగు గ్రామంలోనే కామరాజు, చోళ్ల శ్రీనివాసరావులకు ప్రాధాన్యతనివ్వడం తాజా రచ్చకు ఒక ప్రధాన కారణం. గోకర్నపల్లిలో పదుల సంవత్సరాలుగా చింతాడ ప్రసాద్ వర్గం రవికుమార్ వెంట తిరిగారు. వారిని పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సీపాన శ్రీరంగనాయకులకు ప్రాముఖ్యతనిచ్చి, కాంట్రాక్ట్ పనులు అప్పగించడం చిచ్చు రేపింది.
ఆమదాలవలసలోనూ వర్గాలు....
ఆమదాలవలస పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ కార్యకర్తలు మూడు వర్గాలుగా మారిపోయారు. ప్రస్తుత కౌన్సిలర్ బొడ్డేపల్లి లక్ష్మణరావును పక్కనపెట్టి మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్ ఆ వార్డులోగల బొడ్డేపల్లి విజయ్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తికి అధిక ప్రాధాన్యమిస్తూ వారికి కొన్ని పనులు కూడా కట్టబెట్టారని టీడీపీ కౌన్సిలర్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప«థ్యంలోనే తన కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కమీషన్ స్వీకరించలేదంటూ ఆయన మళ్లీ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆమదాలవలస మండలంలోని కలివరం పంచాయతీకి చెందిన సర్పంచ్ కోట వెంకటరామారావు, జెడ్పీటీసీ బరిలో ఓడిపోయిన ఆయన సోదరుడు కోట గోవిందరావు గత ఏడాది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ గ్రామంలో గిరి అనే వ్యక్తితోపాటు ఆయన వర్గీయులు టీడీపీలోకి చేరడం, వారికి ప్రభుత్వ విప్ అధిక ప్రాధాన్యతను ఇవ్వడం కోట బ్రదర్స్ కోపానికి కారణమైంది. వీరిని బుజ్జగించేందుకు కూన పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
సరుబుజ్జిలిలో ఇంటిపోరు...
సరుబుజ్జిలి మండలంలోనూ కూనకు ఇంటిపోరు తప్పట్లేదు. పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి రామ్మోహనరావు, ఎమ్‌పీటీసీ ప్రతినిధి కిల్లి సిద్ధార్థ మధ్య పొసగట్లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు, సబ్సిడీ రుణాలు తదితర సంక్షేమ పథకాలను తమవారికి కట్టబెట్టేందుకు ఎవ్వరికి వారు ఆధిపత్య ధోరణి చూపిస్తున్నారు. ఇటీవల పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో కమీషన్ విషయంలోనూ మనస్పర్థలు వచ్చాయనే గుసగుసలు పార్టీలో వినిపించాయి. డకరవలస పంచాయతీలో కరణం గోవిందరావు, సర్పంచ్ అదపాక అప్పలనాయుడు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. సరుబుజ్జిలి మండల జన్మభూమి కమిటీ సభ్యుడు శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి నందివాడ గోవిందరావు మధ్య కూడా గత మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. రహదారులు, నీరు–చెట్టు పనులు దక్కించుకునే విషయంలో తరచూ వాదులాటలు జరుగుతున్నాయి.
బూర్జ మండలంలో....
బూర్జ మండలంలో ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, జెడ్‌పీటీసీ సభ్యుడు అన్నెపు రామక్రిష్ణ ఒక గ్రూపులో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వీరికి వ్యతిరేకంగా మండల కన్వీనర్ లంక జగన్నాథనాయుడు, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ మజ్జి శ్రీరాములనాయుడు మరో గ్రూపు నడుపుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడే తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. విప్ కూన రవికుమార్ జెడ్పీటీసీ వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, నీరు–చెట్టు పనులు వారికే అధికంగా ఇస్తున్నారని వీరి వాదన. మామిడివలసలో ఉట్టి లక్ష్మణరావు, జగుపిల్లి మధుసూదనరావు మధ్య, కంట్లాం తాజా మాజీ సర్పంచ్ గిరడ చిన్నారావు, మాజీ సర్పంచ్ గిరడ హరిబాబుల మధ్య కాంట్రాక్టు పనుల విషయంలో వివాదాలు రేగాయి. ఇతర గ్రామాల్లోనూ టీడీపీ నాయకుల మధ్య కుమ్ములాటలకు విప్ పక్షపాత ధోరణే కారణమని పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment