ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: రెవెన్యూశాఖ పరువు రోజురోజుకు అథఃపాతాళానికి దిగజారిపోతోంది. ఈ శాఖలో ఆర్డీవోలు.. తహసీల్దార్లు.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లే కాదు.. చివరకు అట్టడుగునున్న వీఆర్వో, వీఆర్‌ఏలు సైతం వందల కోట్లకు పడగలెత్తడం విస్మయానికి గురిచేస్తోంది. రెవెన్యూ అధికారులకు ఆర్థిక రాజధాని విశాఖ కల్పతరువుగా తయారైంది. ఓ పక్క రికార్డుల ట్యాంపరింగ్, మరో వైపు భూకబ్జాల్లో అక్రమార్కులకు సహకరిస్తూ సర్వేయర్ల నుంచి ఆర్డీవో స్థాయి వరకు కోట్లకు పడగలెత్తారు.
వీరికి తామేం తీసిపోలేదన్నట్టుగా పలువురి వీఆర్వోలు అందినకాడికి చక్కబెట్టుకుంటున్నారు. ఆదాయనికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీకి చిక్కిన వీఆర్వోల్లో ఒకరైన సంజీవ్‌కుమార్ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈయన ఆస్తులు వంద కోట్లు దాటేయడం ఆశ్చర్యమేస్తోంది. మరో వీఆర్వో వెంకటేశ్వరరావుతో పాటు జీవీఎంసీ చైన్‌మెన్ నాగేశ్వరరావు ఆస్తులు రూ.25 కోట్లకుపైగా వెలుగుచూశాయి.
చక్రం తిప్పేది వీఆర్వోలే
గ్రామాల్లోనే కాదు.. సిటీలో కూడా రెవెన్యూ శాఖలో చక్రం తిప్పేది వీఆర్వోలే. తహసీల్దార్లు, డీటీలు సైతం వీఆర్వోలను కాదని ఏ పనిచేయని పరిస్థితి నెలకొంది. ఏళ్లతరబడి పాతుకుపోయిన వీరిని ఎన్నిసార్లు బదిలీ చేసినా రాజకీయ ఒత్తిళ్లతో లక్షలు కుమ్మరించి తాము కోరుకున్న చోట పోస్టింగ్‌ను క్షణాల్లో పొందుతున్నారు. గతంలో పలుమార్లు వీర్ని బదిలీ చేసేందుకు యత్నించిన జేసీలపై కూడా ఒత్తిళ్లు బలంగా పనిచేయడం కన్పించింది. ప్రస్తుతం ఏసీబీకి చిక్కిన వెంకటేశ్వరరావును కశింకోటకు, సంజీవరావును చోడవరం బదిలీ చేస్తే అనతి కాలంలోనే వీరు మళ్లీ నగరానికి వచ్చేశారు.
పేర్లు మార్చేసి దాచుకోవడమే..
గ్రామీణ ప్రాంతాల్లో వెబ్‌ల్యాండ్‌లో మాయాజాలం చేసేదంతా వీరే. ఒకరి సర్వే నెంబర్లు.. మరొకరి పేరిట.. ఒకరి పేరిట ఉన్న భూములు మరొకరి పేరిట మార్చేయడం.. ఆనక బల్లకింద చేతులు చాచడం.. అందినకాడకి దండుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి మ్యుటేషన్ వరకు ప్రతి చోట వేలు..లక్షలు చూడనిదే సంతకాలు కూడా పెట్టని వారెందరో ఉన్నారు.
ఆక్రమణల క్రమబద్ధీకరణతో కాసుల వర్షం
ఇక సిటీతో పాటు పరిసర మండలాల్లో పనిచేసే వీఆర్వోల అక్రమాలైతే ఊçహలకు సైతం అందని పరిస్థితి నెలకొంది. రికార్డులు ట్యాంపరింగ్ చేయడమే కాదు, భూ కబ్జా రాయుళ్లకు అండదండలందించడంలో కూడా వీరిది అంది వేసిన చేయి. గత రెండేళ్లుగా ఆక్రమణల క్రమబద్ధీకరణ కూడా వీరికి కాసుల వర్షం కురిపించింది. కొండవాలు ప్రాంతాలు.. అభ్యంతరకర ఆక్రమణలు, గెడ్డలు, వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణలను సైతం క్రమబద్ధీకరించేందుకు చక్రం తిప్పడంలో వీరే కీలక సూత్రధారులు. తొలి విడతలో క్రమబద్ధీకరించిన వాటిలో మూడోవంతు అభ్యంతరకర, వివాదస్పద భూములలోని ఆక్రమణలే ఎక్కువ.
వీటికి అడ్డుచెప్పారన్న అక్కసుతోనే అప్పట్లో జేసీ జే.నివాస్‌పై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. కానీ క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, వీఆర్వోలు టీడీపీనేతల అడుగులకు మడుగులొత్తుతూ వారి చెప్పిన వారికల్లా పట్టాలు రాసిచ్చేశారు. చివరకు స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేసి క్రమబద్ధీకరణ పట్టాలు పొందారంటే ఏ స్థాయిలో వీఆర్వోలు చక్రం తిప్పారో అర్ధం చేసుకోవచ్చు ఒక్క సంజీవరావే కాదు.. ఇలా ఎంతో మంది కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఒత్తిళ్లకు తొలొగ్గి వీరిపై చర్యలకు తీసుకునేందుకు సాహసించలేకపోతున్నారు.
సిబ్బంది కొరత
జిల్లాలో 925 పంచాయతీలుండగా.. వాటి పరిధిలో 3200 రెవెన్యూ గ్రామాలున్నాయి. సిటీ పరిధిని 14 క్లస్టర్స్, గ్రామీణ జిల్లాను 734 క్లస్టర్స్‌గా విభజించారు. ఆ మేరకు 748 మంది వీఆర్వోలు ఉండాల్సి ఉంది కానీ. జిల్లాలో పనిచేస్తున్నది కేవలం 637 మంది మాత్రమే. గ్రామీణ జిల్లాలోనే 120 పోస్టులు ఖాళీగా ఉండగా.. సిటీ పరిధిలో ఒక వీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. మూడో వంతు వీఆర్వోలు రెండు క్లస్టర్స్‌కు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తుండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు.
ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు చేపట్టా. తహసీల్దార్లను బదిలీ చేశాం. అదే స్థాయిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలను కూడా పెద్ద ఎత్తున బదిలీలు చేయాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ మెజార్టీ వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక నుంచి నేనే స్వయంగా వీరి పనితీరును సమీక్షిస్తా. ప్రతి మండలానికి వెళ్తా. ఆరోపణలు రుజువైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడను. ఆర్డీవోలు, తహసీల్దార్లను కూడా తనిఖీలు చేయమని ఆదేశిస్తా. వీఆర్వోలను మోనటరింగ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతా. క్రమబద్ధీకరణ పట్టాల జారీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించా. అభ్యంతరక భూముల్లో క్రమబద్ధీకరణ జరగకుండా బ్లాక్ చేసేలా చూస్తాం. ఎక్కడైనా అనర్హులకు పట్టా ఇచ్చినట్టుగా తెలిస్తే వెంటనే రద్దు చేయడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం.
– జి.సృజన, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment