అవినీతి సం‘పన్ను’లు!
విజయనగరం లీగల్ : కొత్త ఇంటికి పన్ను వేయమని కోరితే .... మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని భావించి వెంటనే పన్నువేయవలసిన ఆ అధికారులు అమ్యామ్యాలకు వేధించారు. నెల రోజుల పాటు తిప్పారు. దీంతో కాళ్లరిగేలా తిరిగిన ఆ వ్యక్తి చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఆ అవినీతి సం‘పన్ను’లు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కెఎల్‌పురానికి చెందిన కె.శ్రీనివాసరావు బంధువులు అదే ప్రాంతంలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు.
కొత్త ఇంటికి పన్ను విధించమని గత నెల 3న శ్రీనివాసరావు మున్సిపల్ రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఐ పి. ఈశ్వరరావు, బిల్ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు ఆ ఇంటిని పరిశీలించి తక్కువ మొత్తంలో పన్ను విధిస్తామని, అందుకు రూ. 10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేమని శ్రీనివాసరావు వారిద్దరికి తేల్చి చెప్పారు. అయినా వారు రూ. 10 వేల ఇస్తేనే పని అవుతుందంటూ చెప్పడంతో ఈ నెల 2న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో గురువారం మాటు వేశారు.
ఈలోగా ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి మీరు అడిగిన డబ్బులు తెచ్చాను...కార్యాలయం వద్ద ఉన్నానని ఆర్‌ఐ, బిల్ కలెక్టర్‌కు ఫోన్‌లో చెప్పాడు. వెంటనే వారు మేం గాజులరేగ రైల్వేగేటు సమీపంలో ఉన్నామని, అక్కడకు రావాలని సూచించారు. దీంతో ఏసీబీ అధికారులు, శ్రీనివాసరావులు వేర్వేరుగా అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాసరావు రూ.పదివేల ఆర్‌ఐ ఈశ్వరరావుకు ఇస్తుండగా, బిల్ కలెక్టర్ వెంకటేశ్వరరావును తీసుకోమన్నారు. ఆ డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం పరుచుకుని అరెస్టు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టుకు వారిని తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. ఈ దాడిలో సీఐలు ఎస్ లకో్ష్మజి, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నెల రోజులుగా తిరుగుతున్నా ....
నెలరోజులుగా కొత్తింటికి పన్ను విధించమని మున్సిపల్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. లంచం ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పడంతో వేరే గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు.