వైకుంఠపురంలో అవినీతి వరద | Corruption in vaikuntapuram barrage | Sakshi
Sakshi News home page

వైకుంఠపురంలో అవినీతి వరద

Published Fri, Jan 25 2019 2:16 AM | Last Updated on Fri, Jan 25 2019 7:55 AM

Corruption in vaikuntapuram barrage - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతి పరంపరలో తాజాగా వైకుంఠపురం బ్యారేజీ పనులు చేరాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందే ఆ బ్యారేజీ పనుల్లో రూ. 550 కోట్లకుపైగా కమీషన్‌లు కొట్టేయడానికి వ్యూహం రచించారు. చంద్రబాబుకు కోట్లాది రూపాయలు కురిపించిన పట్టిసీమ ప్రాజెక్టు టెండర్ల వ్యూహాన్ని కృష్ణానదిపై నిర్మించే వైకుంఠపురం బ్యారేజీలోనూ అవలంబించి మళ్లీ వందల కోట్లు వెనకేసుకోనున్నారు. నిజానికి జీవో 94 ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ (ఎక్సెస్‌)కు కోట్‌ చేస్తే టెండర్లు రద్దు చేయాలి. కానీ, ఆ నిబంధనను సడలించి ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూళ్లు కోట్‌ చేసేలా వైకుంఠపురం బ్యారేజీ పనులకు ఈనెల 21న సర్కార్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 4లోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. 5న టెక్నికల్‌ బిడ్, 7న ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరిచి టెండర్‌ ఖరారు చేయనున్నారు. 24.99 శాతం ఎక్సెస్‌కు నవయుగ షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు చంద్రబాబుకు ఆ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. 4.99 శాతం ఎక్సెస్‌.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం ‘బోనస్‌’ (ఆర్నెల్లకు ఐదు శాతం చొప్పున) ఇచ్చేలా షరతులు పెట్టి కేబినెట్‌లో ఆమోదముద్ర వేసేలా స్కెచ్‌ వేశారు. ఆ వెంటనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చి పట్టిసీమ తరహాలోనే కమీషన్‌లు వసూలు చేసుకోనున్నారు. ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల 4న ‘వైకుంఠపురంలో పట్టిసీమ వ్యూహం’ శీర్షికన కథనం ప్రచురించింది. 

మూడుసార్లు టెండర్లు రద్దు
రాజధాని నగర నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పనులకు రూ. 801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్‌ఎస్‌ (లంప్సమ్‌)–ఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పనులను నవయుగ సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయించడంతో.. ఇతరులెవరూ షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సాహసించలేదు. అయితే ఆ ధరలు తమకు గిట్టుబాటు కావంటూ నవయుగ కూడా షెడ్యూళ్లు దాఖలు చేయలేదు. కాంట్రాక్టర్‌ సూచనల మేరకు.. అంచనా వ్యయాన్ని పెంచాలని జలవనరుల శాఖపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1025.98 కోట్లకు అంతర్గత అంచనా వ్యయం (ఐబీఎం–ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌)ను పెంచేసి ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో గతేడాది ఆగస్టు 31న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉన్నందున ఆ అంచనా వ్యయం కూడా గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్‌ తేల్చిచెప్పడంతో ఆ టెండర్లను కూడా రద్దు చేశారు. దాంతో ఐబీఎంను రూ.1075.15 కోట్లకు పెంచి గతేడాది అక్టోబర్‌ 25న మూడోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.. దీనికి కూడా కాంట్రాక్టర్‌ సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టెండర్లను రద్దు చేశారు.

నాలుగో సారి.. పట్టిసీమ వ్యూహం
వైకుంఠపురంలో కమీషన్లు భారీగా దండుకోవడానికి చంద్రబాబు ‘పట్టిసీమ’ వ్యూహాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐబీఎంను రూ. 1,459 కోట్లకు పెంచేలా చేశారు. ఈనెల 21న నాలుగో సారి ఈపీసీ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. 24.99 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కాంట్రాక్టర్‌కు సూచించారు. ‘ఐదు శాతం కంటే ఎక్సెస్‌’ నిబంధనలను సడలించారు. పట్టిసీమ ఎత్తిపోతల్లో 21.99 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. 5 శాతం ఎక్సెస్‌.. ఏడాదిలోగా పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్‌ ఇచ్చేలా షరతు విధించి ఆ టెండర్‌ను కేబినెట్‌లో ఆమోదించారు. అదే వ్యూహాన్ని వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలోనూ అనుసరించారు. నవయుగ మాత్రమే టెండర్‌ దాఖలు చేస్తే.. నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవయుగతో పాటు మరో కోటరీ సంస్థతో టెండర్‌ దాఖలు చేయించేందుకు అనుగుణంగా నిబంధనలు మార్చారు. రెండు సంస్థల మధ్య సీఎం చంద్రబాబు కుదిర్చిన ఒప్పందం మేరకు నవయుగ 24.99 శాతం ఎక్సెస్‌.. కోటరీ సంస్థ 26 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేయాలి. దీంతో ఎల్‌–1గా నిలిచే నవయుగకే పనులు కట్టబెట్టనున్నారు. 

వ్యయం 8 వందల కోట్ల నుంచి 18 వందల కోట్లకు
అంచనా వ్యయాన్ని రూ. 801.88 కోట్ల నుంచి రూ. 1,459 కోట్లకు పెంచేశారు. దీనికి తోడు 24.99 శాతం ఎక్సెస్‌ అంటే.. మరో రూ. 364.60 కోట్లు పెరుగుతుంది. దీంతో మొత్తం పనుల ఒప్పందం విలువ రూ.1,823.6 కోట్లకు చేరుతుంది. పనుల అంచనా వ్యయం రూ. 1,021 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇందులో రూ. 550 కోట్లకుపైగా కమీషన్‌ల రూపంలో ముఖ్యమంత్రి వసూలు చేసుకోనున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement