పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ఒకే రకమైన అవసరాలు తీర్చేవి అయినప్పుడు ప్రభుత్వం కొత్తగా రూ. 1300 కోట్లతో పట్టిసీమను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి, సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. 4 ఏళ్లలోనే పోలవరం పూర్తవుతుందంటూనే పట్టిసీమకు అన్ని నిధులు ఖర్చు చేయడమెందుకన్నారు. పోలవరం నిర్మాణంపై నమ్మకంలేకే ప్రభుత్వం పట్టిసీమ నిర్మాణానికి పూనుకుందనే అనుమాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ‘పోలవరం పూర్తయ్యే నేపథ్యంలో పట్టిసీమ అవసరమేంటి? ఇది ముడుపుల ప్రాజెక్టుగా మేం భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నీళ్లను లిఫ్ట్ చేయడానికి కాదు. నోట్లను లిఫ్ట్ చేసుకోవడానికే ప్రాజెక్టు తెచ్చారని ప్రజలు భావిస్తున్నారు’ అని సారథి పేర్కొన్నారు.
పట్టిసీమను ఒక ఏడాదిలోనే పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుబట్టారు. ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు నిర్మించే కాల్వ భూ సేకరణలో 1700 ఎకరాలపై కోర్టు కేసులున్నాయని, అవి పరిష్కారమై.. ఏడాదిలోనే ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలతో ప్రభుత్వం మాట్లాడిందా?’ అని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడే కృష్ణా డెల్టాకు, సాగర్ ఆయకట్టుకు సరిగా నీరివ్వలేని ప్రభుత్వం.. పట్టిసీమతో శ్రీశైలం ద్వారా రాయలసీమ, ఇతర అవసరాలను తీరుస్తుందంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని అమలు చేయించలేకపోయారు. కేంద్రం నుంచి ఆర్థిక లోటు నిధులనూ రాబట్టలేకపోయారు. దీంతో పోలవరం సాధించలేమన్న భయంతోనే ప్రభుత్వం పట్టిసీమను నిర్మిస్తోందన్న అనుమానాలు ప్రజలకున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి’ అని సారథి డిమాండ్ చేశారు.