పట్టిసీమ అవినీతిని ప్రధానికి చెప్పారనే జగన్‌పై నిందలు
- టీడీపీపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రోజా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించిన అంశాలను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సమగ్రంగా వివరించడంతోనే టీడీపీ నేతలు ఉడుక్కొని ఆయనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా దుయ్యబట్టారు. ఆమె బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతూనే పట్టిసీమ పేరిట రూ.1,300 కోట్లు వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది లోకేష్‌కో, చంద్రబాబుకో న్యాయం చేయడానికి ఉద్దేశించిందేగానీ సీమ ప్రజలకోసం కాదని ఆమె స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం కేంద్రం చేసేది కాబట్టి అందులో డబ్బులు రావనే ఈ పట్టిసీమను తెచ్చారేతప్ప ఇందులో ప్రజల ప్రయోజనం లేదన్నారు. ఇవన్నీ వాస్తవం కాకపోతే జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీ నేతల్లో కలవరమెందుకని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రధానిని కలిస్తే.. తన కేసుల కోసమని బురద జల్లుతున్నారని ఆమె తూర్పారబట్టారు.
మోదీపై నమ్మకం లేదా?
అసలు మీరు కలసి పోటీ చేసిన బీజేపీపై మీకు నమ్మకం లేదా? అని ఆమె సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. జగన్ కలిస్తేనే మోదీ ఆయనపై కేసులు మాఫీ చేస్తారని మీరు అంటున్నారంటే.. ప్రధాని కోర్టు కేసులు తారుమారు చేస్తారని మీరు భావిస్తున్నారా?, మోదీని అనుమానిస్తున్నారా? స్పష్టంగా చెప్పాలని రోజా నిలదీశారు. బాబు, టీడీపీ నేతల మాదిరిగా జగన్‌కు కూడా కాళ్లు పట్టుకునే నీచమైన బుద్ధి ఉంటే ఈరోజు ఆయన ‘తెలుగు కాంగ్రెస్’ పెట్టిన కేసుల్లో ఇరుక్కునే వారు కాదని స్పష్టం చేశారు. జగన్ ఢిల్లీలో ఎవరిని కలసినా.. ఆ వెంటనే అక్కడే జాతీయ మీడియా ముందే మాట్లాడారని, కానీ బాబు మోదీని కలసిన తరువాత ఢిల్లీలో మాట్లాడకుండా రాష్ట్రానికి వచ్చి తనకు అనుకూల మీడియాలో కేంద్రం అన్యాయం చేస్తున్నట్టుగా ప్రకటన చేస్తుంటారని ఆమె దుయ్యబట్టారు. బాబును కాపాడడంకోసం ఆనాడు తన స్పీకర్ పదవిని కూడా పణంగా పెట్టి ఎన్టీఆర్‌ను సీఎంగా తన చివరి ప్రసంగం చేయకుండా ఆయన మైక్ కట్ చేసిన వ్యక్తి యనమల అని రోజా దుయ్యబట్టారు.
జగన్ వెళ్లిన వేళా విశేషమో ఏమో..
జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన వేళా విశేషమో ఏమో.. అదేరోజు రాష్ట్రానికి నిధులు వచ్చినప్పటికీ తాము ఆ విషయాలపై ఏమీ మాట్లాడలేదుగానీ.. కేంద్రమంత్రి నిధుల విడుదల ప్రకటన చేయగానే టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, సుజనా చౌదరిలు చేసిన హడావుడిని అంతా టీవీల్లో చూశారన్నారు.