Roja MLA
-
తనకు కావాల్సిన వారినే కలెక్టర్లుగా పెట్టుకున్నారు..
సాక్షి, తిరుపతి: తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం ఎస్ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డకు తనపై తనకే నమ్మకం లేదని, ఆయన చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి, ఓటర్ల జాబితాపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారని ఫిర్యాదు చేశారు. గతేడాది అప్డేట్ చేసిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2019 జనవరి వరకు ఉన్న ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్నామని, ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్ఈసీ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ-వాచ్ యాప్ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం ఉంది: బాలశౌరి న్యూఢిల్లీ: ఎస్ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై అనేక సందేహాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ యాప్ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం కలుగుతోందని అన్నారు. యాప్ ఎక్కడ తయారైందో వెంటనే విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీ పదవులే ఏకగ్రీవాలవుతుంటే, ఎస్ఈసీ సర్పంచ్ల ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నిమ్మగడ్డ.. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ చరిత్రలో బాగుపడినట్లు లేదని ధ్వజమెత్తారు. -
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఏన్టీఆర్ భవన్ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్ మీడియం కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని విమర్శించారు. అదే విధంగా మహిళలకు అండగా ఉండాలని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఆలోచనతోనే సీఎం జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల్లో రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్ధేశంతోనే సెక్రటరీ, వాలంటరీ ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనదని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో కూడా అలాగే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించి వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేలా చేస్తూ సీఎం జగన్ రైతు బాంధవుడయ్యాడని కొనియాడారు. -
శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబుకెందుకు?
సాక్షి, హైద్రాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి నాలుగేళ్లలో ఎన్నిచేయాలో అన్ని చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించను అంటున్నారంటే చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. దొంగల్ని, ఆర్థిక నేరగాళ్లను కాపాడే అడ్డాగా ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు మార్చేశారని నిప్పులు చెరిగారు. 100 శాతం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబే చేయించారనడానికి, ఆయన మాటలే నిదర్శనమన్నారు. ఇదంతా ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజీ అనే నటుడితో చెప్పించారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అతన్ని ఎందుకు విచారించలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ... 'చంద్రబాబు హిట్లర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదు. మహిళను కాకినాడలో పట్టుకుని ఫినిష్ చేస్తానని గూండాలా బెదిరించారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించారు. కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేస్తే నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎన్ఐఏ విచారణకి నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకు? మీకు బాధ లేనపుడు ఆ కేసును ఎన్ఐఏకి అప్పగించాలి. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చౌదరి చంద్రబాబు బినామి. ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించింది చంద్రబాబే. దాడికి ఉపయోగించిన కత్తి ఎంతో కాలంగా అక్కడ ఉంచారు. ఎన్ఐఏకి కేసు అప్పగించాలని ఆ అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదంట. హత్యాయత్నం వెనక ఉన్న వారు హర్షవర్దన్ చౌదరిగాని, శివాజి చౌదరిగాని అందర్ని బయటకు లాగాలి. వైఎస్ జగన్, బీజేపీతో కలసి కుట్ర చేస్తున్నారంటారు. బీజేపితో కలసి ఎన్నికలకు వెళ్లింది ఎవరు? ప్రభుత్వంలో కలసి పనిచేసింది మీరు కాదా? చంద్రబాబు ఎప్పటికి మా మిత్రుడే అని రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో చెప్పారు. బీజేపీతో లాలూచి పడింది చంద్రబాబే. మోదీకి ఊడిగం చేస్తోంది చంద్రబాబే. ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బీజేపీపై బురద జల్లి బయటకు వెళ్లడం మళ్లీ అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది మీరు కాదా? మహారాష్ట్ర బీజేపి మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ చేసింది మీరు కాదా? రేపు ఏమైనా కేసులు వస్తే ఆయనతో పనిచేయించుకోవడానికేనా? కేంద్రంపై యుధ్దం అని చెప్పి నీతి అయోగ్ మీటింగ్‌కు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ బయోపిక్కు క్లాప్ కొట్టింది వెంకయ్యనాయుడు కాదా? కర్ణాటక ఎన్నికలయ్యాక నన్ను అరెస్ట్ చేయబోతున్నారని, మీరు నన్ను రక్షించుకోవాలని ప్రజలను కోరలేదా? ఈరోజు వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అంటే అర్థం ఏంటి? లాలూచి కాదా? శంకరర్రావు, ఎర్రన్నాయుడుతో కుమ్మక్కై కేసులు పెట్టించినా ధైర్యంగా వైఎస్ జగన్ ఎదుర్కొంటున్నారు. కిడారి సర్వేశ్వరరావును హత్య చేస్తే ఎన్ఐఏకి అప్పగించింది మీరు కాదా? అది సమాఖ్య స్పూర్తికి విరుద్దం కాదా? ఎమ్మెల్యేను రక్షించుకోలేని చేతకాని దద్దమ్మ చంద్రబాబు. కిడారి సర్వేశ్వరరావు కేసును బదిలి చేసినట్టే వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు ఎందుకు ఎన్ఐఏకి ఇవ్వడం లేదు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్నారు. మరి మీ చుట్టు ఉన్న జెడ్ కేటగిరి భద్రత కేంద్రం కల్పించిందే కదా. వారిని నీ చుట్టు ఎందుకు ఉంచుకుంటున్నావు. వారిని పంపించేయి. తిరిగి అధికారంలోకి రాను అని భావించి చంద్రబాబు ఎయిర్ పోర్ట్‌లో భౌతికంగా వైఎస్ జగన్‌ను లేకుండా చేయడానికి ప్లాన్ చేసినా, భగవంతుడి దయ వల్ల ఆయన బయటపడ్డార'ని అన్నారు. -
ఎమ్మెల్సీపై పరువునష్టం దావా వేస్తా
సాక్షి, చిత్తూరు(పుత్తూరు): ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుకు మతిభ్రమించినట్లుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్చానని ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముద్దుకృష్ణమనాయుడుపై పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తన నిజాయితీ గురించి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో ప్రజాసమస్యలపై మాట్లాడిన విషయాలు ఉంటాయి గాని, నీతి నిజాయితీలు ఉండవన్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా సుమారు 150 సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించానని వాఖ్యానించారు. ఎమ్మెల్సీ లాగా లెక్చరర్ ఉద్యోగం చేస్తూ సూట్ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకునే వ్యక్తి అని రోజా అన్నారు. ఎమ్మెల్సీ తన లేఖలపైన రోజుకు ఎంతమందికి దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.45 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వాకింగ్ ట్రాక్‌గా మారిపోవడానికి ఎమ్మెల్సీ ధనదాహమే కారణమని నిప్పులు చెరిగారు. పట్టణంలోని సదాశివేశ్వరస్వామి కోనేరు స్థలంలోని దుకాణాల అద్దె భగవంతుడికి చెందాల్సి ఉండగా, ఎమ్మెల్సీ అనుచరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వడమాలపేట టోల్‌ప్లాజా నిర్వాహకులు సక్రమంగా రోడ్డు నిర్మించకపోయినా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇందుకుగాను ఎమ్మెల్సీకి తిరుపతిలో ఇళ్లు నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు. కమిషనర్ చర్యలు తీసుకోవాలి.. పాత స్టాండ్ వద్ద దుకాణాల లీజు పేరుతో మున్సిపల్ స్థలాలను టీడీపీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. దుకాణాలను తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, ప్రతాప్, ఎంపీపీ మురళిరెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, బాబూరావ్‌గౌడ్, సుబ్రమణ్యంయాదవ్, లక్ష్మణమూర్తి, రవి పాల్గొన్నారు. -
తన కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
బాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రోజా సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హోదాను కాపాడుకోవడం కోసం కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె తన సహచర ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరితో కలిసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, యువకులకు ఉద్యోగాలు వస్తాయని... అదే ప్యాకేజీలు వస్తే టీడీపీ నేతలకు కమీషన్లు వస్తాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాల్సిందేనని.. హోదా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తుంటే అదేదో అనవసరమైన విషయంగా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. -
పట్టిసీమ అవినీతిని ప్రధానికి చెప్పారనే జగన్‌పై నిందలు
టీడీపీపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రోజా ధ్వజం సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించిన అంశాలను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సమగ్రంగా వివరించడంతోనే టీడీపీ నేతలు ఉడుక్కొని ఆయనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా దుయ్యబట్టారు. ఆమె బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతూనే పట్టిసీమ పేరిట రూ.1,300 కోట్లు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది లోకేష్‌కో, చంద్రబాబుకో న్యాయం చేయడానికి ఉద్దేశించిందేగానీ సీమ ప్రజలకోసం కాదని ఆమె స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం కేంద్రం చేసేది కాబట్టి అందులో డబ్బులు రావనే ఈ పట్టిసీమను తెచ్చారేతప్ప ఇందులో ప్రజల ప్రయోజనం లేదన్నారు. ఇవన్నీ వాస్తవం కాకపోతే జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీ నేతల్లో కలవరమెందుకని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రధానిని కలిస్తే.. తన కేసుల కోసమని బురద జల్లుతున్నారని ఆమె తూర్పారబట్టారు. మోదీపై నమ్మకం లేదా? అసలు మీరు కలసి పోటీ చేసిన బీజేపీపై మీకు నమ్మకం లేదా? అని ఆమె సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. జగన్ కలిస్తేనే మోదీ ఆయనపై కేసులు మాఫీ చేస్తారని మీరు అంటున్నారంటే.. ప్రధాని కోర్టు కేసులు తారుమారు చేస్తారని మీరు భావిస్తున్నారా?, మోదీని అనుమానిస్తున్నారా? స్పష్టంగా చెప్పాలని రోజా నిలదీశారు. బాబు, టీడీపీ నేతల మాదిరిగా జగన్‌కు కూడా కాళ్లు పట్టుకునే నీచమైన బుద్ధి ఉంటే ఈరోజు ఆయన ‘తెలుగు కాంగ్రెస్’ పెట్టిన కేసుల్లో ఇరుక్కునే వారు కాదని స్పష్టం చేశారు. జగన్ ఢిల్లీలో ఎవరిని కలసినా.. ఆ వెంటనే అక్కడే జాతీయ మీడియా ముందే మాట్లాడారని, కానీ బాబు మోదీని కలసిన తరువాత ఢిల్లీలో మాట్లాడకుండా రాష్ట్రానికి వచ్చి తనకు అనుకూల మీడియాలో కేంద్రం అన్యాయం చేస్తున్నట్టుగా ప్రకటన చేస్తుంటారని ఆమె దుయ్యబట్టారు. బాబును కాపాడడంకోసం ఆనాడు తన స్పీకర్ పదవిని కూడా పణంగా పెట్టి ఎన్టీఆర్‌ను సీఎంగా తన చివరి ప్రసంగం చేయకుండా ఆయన మైక్ కట్ చేసిన వ్యక్తి యనమల అని రోజా దుయ్యబట్టారు. జగన్ వెళ్లిన వేళా విశేషమో ఏమో.. జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లిన వేళా విశేషమో ఏమో.. అదేరోజు రాష్ట్రానికి నిధులు వచ్చినప్పటికీ తాము ఆ విషయాలపై ఏమీ మాట్లాడలేదుగానీ.. కేంద్రమంత్రి నిధుల విడుదల ప్రకటన చేయగానే టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, సుజనా చౌదరిలు చేసిన హడావుడిని అంతా టీవీల్లో చూశారన్నారు. -
ఎమ్మెల్యే రోజాపై టీడీపీ తీరును నిరసిస్తూ ధర్నా
ఏలేశ్వరం : శాసనసభలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ప్రవర్తించిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. గోరంట్ల తమ వైఖరి మార్చుకోకపోతే మహిళలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కళాకారుడైన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉంటూ కళాకారులను విమర్శించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. ఎన్టీఆర్ పెట్టిన బిక్షతో పాలన సాగిస్తున్న ఆపార్టీ నాయకులు ఇకనైనా గతం మరిచిపోకూడద ని గుర్తుచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సామంతుల సూర్యకుమార్, గొడత చంద్ర, భజంతుల మణి, వాడపల్లి శ్రీను, పేకలజాన్, ఉమ్మడిసింగు సత్యనారాయణ, గూనాపు అప్పలరాజు, తూరోతు దొరయ్య, కూనపురెడ్డి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.