సాక్షి, చిత్తూరు(పుత్తూరు): ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుకు మతిభ్రమించినట్లుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్చానని ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముద్దుకృష్ణమనాయుడుపై పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తన నిజాయితీ గురించి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో ప్రజాసమస్యలపై మాట్లాడిన విషయాలు ఉంటాయి గాని, నీతి నిజాయితీలు ఉండవన్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా సుమారు 150 సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించానని వాఖ్యానించారు. ఎమ్మెల్సీ లాగా లెక్చరర్ ఉద్యోగం చేస్తూ సూట్ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు.
అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం..
ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకునే వ్యక్తి అని రోజా అన్నారు. ఎమ్మెల్సీ తన లేఖలపైన రోజుకు ఎంతమందికి దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.45 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వాకింగ్ ట్రాక్‌గా మారిపోవడానికి ఎమ్మెల్సీ ధనదాహమే కారణమని నిప్పులు చెరిగారు. పట్టణంలోని సదాశివేశ్వరస్వామి కోనేరు స్థలంలోని దుకాణాల అద్దె భగవంతుడికి చెందాల్సి ఉండగా, ఎమ్మెల్సీ అనుచరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వడమాలపేట టోల్‌ప్లాజా నిర్వాహకులు సక్రమంగా రోడ్డు నిర్మించకపోయినా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇందుకుగాను ఎమ్మెల్సీకి తిరుపతిలో ఇళ్లు నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు.
కమిషనర్ చర్యలు తీసుకోవాలి..
పాత స్టాండ్ వద్ద దుకాణాల లీజు పేరుతో మున్సిపల్ స్థలాలను టీడీపీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. దుకాణాలను తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, ప్రతాప్, ఎంపీపీ మురళిరెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, బాబూరావ్‌గౌడ్, సుబ్రమణ్యంయాదవ్, లక్ష్మణమూర్తి, రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment