muddukrishnama naidu
-
ఎమ్మెల్సీపై పరువునష్టం దావా వేస్తా
సాక్షి, చిత్తూరు(పుత్తూరు): ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుకు మతిభ్రమించినట్లుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్చానని ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముద్దుకృష్ణమనాయుడుపై పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తన నిజాయితీ గురించి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో ప్రజాసమస్యలపై మాట్లాడిన విషయాలు ఉంటాయి గాని, నీతి నిజాయితీలు ఉండవన్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా సుమారు 150 సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించానని వాఖ్యానించారు. ఎమ్మెల్సీ లాగా లెక్చరర్ ఉద్యోగం చేస్తూ సూట్ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకునే వ్యక్తి అని రోజా అన్నారు. ఎమ్మెల్సీ తన లేఖలపైన రోజుకు ఎంతమందికి దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.45 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వాకింగ్ ట్రాక్‌గా మారిపోవడానికి ఎమ్మెల్సీ ధనదాహమే కారణమని నిప్పులు చెరిగారు. పట్టణంలోని సదాశివేశ్వరస్వామి కోనేరు స్థలంలోని దుకాణాల అద్దె భగవంతుడికి చెందాల్సి ఉండగా, ఎమ్మెల్సీ అనుచరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వడమాలపేట టోల్‌ప్లాజా నిర్వాహకులు సక్రమంగా రోడ్డు నిర్మించకపోయినా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇందుకుగాను ఎమ్మెల్సీకి తిరుపతిలో ఇళ్లు నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు. కమిషనర్ చర్యలు తీసుకోవాలి.. పాత స్టాండ్ వద్ద దుకాణాల లీజు పేరుతో మున్సిపల్ స్థలాలను టీడీపీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. దుకాణాలను తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, ప్రతాప్, ఎంపీపీ మురళిరెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, బాబూరావ్‌గౌడ్, సుబ్రమణ్యంయాదవ్, లక్ష్మణమూర్తి, రవి పాల్గొన్నారు. -
దేశం పాలనలో రక్షణ కరువు
తమిళనాడు క్రిమినల్స్‌తో ముద్దుకృష్ణమనాయుడు దాడులు శాంతి భర్త కేజే కుమార్ ఆరోపణ చెన్నై: టీడీపీ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో తన సతీమణిపై జరిగిన దాడి ఉదంతమే నిదర్శనమని చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ చైర్పర్సన్ కె.శాంతి భర్త కేజే కుమార్ అన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన శాంతిని సోమవారం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శాంతి భర్తకేజే కుమార్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు చైర్‌పర్సన్‌కు ఉంటుందనే విచక్షణను మరిచిన ముద్దు కృష్ణమనాయుడు తమపై దాష్టీకానికి పూనుకున్నారన్నారు. దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన అమృత్‌రాజ్ తమిళనాడుకు చెందిన నేరస్తుడన్నారు. బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ తమిళనాడు పోలీసుల రికార్డుల్లో పీడీ యాక్టుకు గురై ఏడాదిపాటూ అమృతరాజ్ పుళల్‌లో జైలు జీవితం గడిపాడని చెప్పారు. అతని సోదరుడు మైఖేల్‌రాజ్ నకిలీ మద్యం తయారీలో నిందితుడని చెప్పారు. అమృత్‌రాజ్ ఏడాదిపాటూ పుళల్‌లో జైలు జీవితం గడిపి బయటకు రాగా ఇంకా కేసు విచారణలో ఉందని అన్నారు. తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని ఉన్న నేరస్తులను గాలి ముద్దుకృష్ణమనాయుడు చేరదీశారని ఆరోపించారు. స్థానిక ప్రజల్లోనే కాదు, ప్రతిపక్షాల్లో సైతం తమకు మంచిపేరున్న కారణంగా దాడుల కోసం తమిళనాడు గూండాలపై ఆయన ఆధారపడాల్సి వచ్చిందని విమర్శించారు. ఫోన్ ద్వారా పరామర్శించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ముద్దుకృష్ణమా.. జాగ్రత్త...
తిరుపతి : ''ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతున్నందుకు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు ఏదైనా ఉంటే నాతో ఢీ కొట్టాలి. అలా కాకుండా నా అనుచరులను, అమాయకులను వేధిస్తూ, కేసులో బెదిరించాలని చూస్తే వదిలేది లేదు. ముద్దుకృష్ణమా.. జాగ్రత్త. మళ్లీ ఇలాంటివి పునరావృతం చేస్తే ఊరుకోం...'' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా హెచ్చారించారు. జిల్లా జైలులో ఉన్న నగరి వైఎస్ఆర్ సీపీ నాయకులు కేజే.కుమార్ తదితరులను ఆమె నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అనుచరులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా పక్కదారి పట్టాయని విమర్శించారు. పోలీసులను గుప్పెట్లో ఉంచుకుంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. నగరి కమిషనర్ అవినీతికి పరాకాష్టని, ఆయన ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పై దాడి చేసిన పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని రోజా మండిపడ్డారు.