సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఏన్టీఆర్ భవన్ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్ మీడియం కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని విమర్శించారు.
అదే విధంగా మహిళలకు అండగా ఉండాలని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఆలోచనతోనే సీఎం జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల్లో రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్ధేశంతోనే సెక్రటరీ, వాలంటరీ ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనదని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో కూడా అలాగే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించి వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేలా చేస్తూ సీఎం జగన్ రైతు బాంధవుడయ్యాడని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment