అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!
‘అనుసంధానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రదర్శించిన నాటకం రక్తి కట్టలేదు. పుష్కరాల్లో చేసిన పబ్లిసిటీ వేట లాగే ఇదీ వికటించింది. పట్టిసీమ పేరుతో లేచిన అవినీతి ‘కురుపు’ కనిపించకుండా ‘అనుసంధానం’ అనే ముసుగును కప్పేశారు. ఎవరి కంటా పడకుండా హంద్రీనీవా ప్రాజెక్టు మోటారును రహస్యంగా ఎత్తుకొచ్చారు. మూడురోజులు తంటాలు పడి కాసిన్ని గోదావరి నీళ్లు తోడి పోశారు. తోడుగా కొన్ని తాడిపూడి ఎత్తి పోతల నీళ్లను కలిపారు. వీటికి కొద్దిపాటి వర్షం నీరు తోడైంది.
వైఎస్సార్ హయాంలో 80% పూర్తయిన పోలవరం కుడి కాల్వను ఉపయోగించుకొని కీర్తి కిరీటం పెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన కొద్దిపాటి కాల్వ పనులను నాసిరకంగా ముగించడంతో కృష్ణాకు వెళ్లాల్సిన నీళ్లు తమ్మిలేరులోకి జారిపోయి కొల్లేరు బాట పట్టాయి.
ఒక్క మోటారు ఆన్ చేస్తేనే బద్దలైన కుడికాల్వ అక్విడెక్ట్
* పట్టిసీమను హడావుడిగా పూర్తి చేసేందుకు నాణ్యత పట్టించుకోని ప్రభుత్వం
* ప్రచార ఆర్భాటం కోసం హడావుడిగా ఏర్పాట్లు
* మోటార్లు లేకుండానే నదుల అనుసంధానమంటూ సీఎం ఆర్భాటం
* దివంగత వైఎస్ చేసిన పనులను తానే చేసినట్టుగా
* చెప్పుకోవాలనే తాపత్రయం
సాక్షి, హైదరాబాద్/ఏలూరు/కర్నూలు: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మోసం మరోసారి బట్టబయలయింది. హంద్రీనీవా నుంచి మోటారు తీసుకొచ్చి పట్టిసీమలో బిగించడానికి ప్రభుత్వం అనుమతించడం.. సర్కారు మోసపూరిత వైఖరికి నిదర్శనం.
హడావుడిగా చేస్తున్న పోలవరం కుడికాల్వ పనుల్లో నాణ్యత లేదంటూ సంబంధిత ఇంజినీర్లు నెత్తీనోరూ కొట్టుకున్నా.. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని ఫలితం ఇప్పుడు బయటపడింది. రికార్డు సమయంలోనే పట్టిసీమలో మోటారు నడిపించామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల తాగునీటికి ఆధారమైన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) నుంచి మోటారు తీసుకురావడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనుమతివ్వడం గమనార్హం. ఈనెల 11వ తేదీనే హంద్రీనీవా నుంచి మోటారు తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల ముందే సీఎం నుంచి మౌఖికంగా అనుమతి తీసుకున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
పోలవరానికి ఉరి.. పట్టిసీమకు ఊపిరి
పట్టిసీమ టెండర్ల దశలోనే దోపిడీకి ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. జాతీయ హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, కాసులపై కక్కుర్తితో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఊపిరి పోశారు. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి.. గడువులోగా పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్‌గా చెల్లిస్తామంటూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్‌తో ముందుగా అవగాహన ఉండటం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ వెల్లువెత్తిన విమర్శలనూ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పోలవరం కుడికాల్వ పనుల్లోనూ అంతా హడావుడి, అవినీతి నిర్ణయాలే తీసుకున్నారు. నాణ్యతను పరిశీలించి అధికారులు ధ్రువీకరించిన తర్వాతే బిల్లులు చెల్లించడం సాధారణంగా జరిగేది. కానీ కుడికాల్వ పనుల విషయంలో ఈ నిబంధనలకు స్వయంగా ప్రభుత్వ పెద్దలే తూట్లు పొడిచారు. నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లులు చెల్లించడం వెనుక.. అధికారపార్టీ నేతల చేతివాటం ఉందని నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం.. జరిగిందంటూ ముఖ్యమంత్రి అబద్దాల హోరులో వాస్తవం కనబడకుండా ప్రచార ఆర్భాటం కప్పేసే ప్రయత్నం చేసింది.
అంతటా హడావుడే..: ఈనెల 16 ఉదయం పట్టిసీమలో మోటారును ప్రారంభించాలని పట్టుబట్టి హంద్రీనీవా నుంచి మోటారును అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తీసుకు వచ్చి అదే రోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నదుల అనుసంధాన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అప్పటికే హంద్రీనీవా నుంచి వచ్చిన మోటారు అక్కడికి చేరింది. కానీ పంపు అలైన్‌మెంట్ సరిగా కుదరక పోవడంతో మోటారు ఏర్పాటు చేయలేక కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేశారు.
పట్టిసీమలో మోటారు పెట్టకుండానే.. నదుల అనుసంధానం చేశామని సీఎం ప్రకటించారు. తర్వాత పట్టిసీమ వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. అప్పటికీ అక్కడ మోటారు బిగించలేకపోయారు. హంద్రీనీవా నుంచి తెచ్చిన మోటారును 17న బిగించారు. 18న మోటారు ఏర్పాటు చేసి సాగునీటి మంత్రి దేవినేని ఉమ ఆన్ చేశారు. 19న కుడికాల్వకు గండి పడింది. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు బద్ధలైంది.
ఒక్క మోటారుకే తెగిపోయింది..
అన్నీ ఆన్ చేస్తే?: ఒక్క మోటారు ఆన్ చేస్తేనే కుడికాల్వ తెగిపోయింది. మరి అన్ని మోటార్లు ఆన్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్నకు నీటిపారుదల శాఖ అధికారులు సమాధానం వెతుక్కుంటున్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని తాము తొలి నుంచీ ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కుడికాల్వ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’తో వాపోయారు.
అన్ని మోటార్లు నడిస్తే.. గండి ఒక్కచోటకే పరిమితం కాదని, చాలా చోట్ల కాల్వకు గండ్లు పడే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు కాల్వ తెగడం వల్ల తమ్మిలేరులో చేరిన నీరంతా ఏలూరు నగరాన్ని ముంచెత్తేది. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. ఎందుకంటే.. తమ్మిలేరు ఏలూరు మీదుగా ప్రవహిస్తోంది.
నిజస్వరూపం బయటపడుతుందనే....
పట్టిసీమ డొల్లతనాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎప్పుడో బయటపెట్టింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని నమ్ముకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎత్తిపోతల పథకంతో నదుల అనుసంధానం అని చెప్పుకోవడమే సిగ్గుచేటని, అది కూడా కనీసం ఒక్క మోటారు పెట్టకుండానే నదులు అనుసంధానం చేశామని ఘనంగా ప్రకటించుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు కూడా ఆగలేకపోవడాన్ని చూస్తుంటే.. తమ నిజస్వరూపం బయటపడుతుందనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని స్పష్టమవుతోందని చెబుతున్నారు.
గతంలో వైఎస్ మార్కు..ప్రస్తుతం ‘మమ’
175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 130 కి.మీ.కు పైగా కాల్వను దివంగత వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడమంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ సహ పనులు పూర్తి చేయిం చారు.కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే చెప్పుకోవడానికిప్రయత్నించింది.
కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నించి అభాసుపాలయింది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులను హడావుడిగా చేసింది. నాణ్యతను పట్టించుకోకుండా మమ అనిపించింది. కాంక్రీట్ నిర్మాణాల్లోనూ నాణ్యత లేకపోవడంతో కాల్వకు గండిపడటానికి ప్రభుత్వం కారణమయింది.
ఇక పట్టిసీమ పంపు మూత
పట్టీసీమ ప్రాజెక్టులో ఒకే ఒక్క పంపును ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం 24 గంటలు తిరక్కముందే ఆ పంపునూ నిరవధికంగా మూసివేసింది. భారీ గండి పడి కుడికాల్వలో ప్రవహించే నీరు తమ్మిలేరులో కలిసిపోతున్న దృష్ట్యా అక్విడెక్టు ఎగువన ఆదివారం యుద్ధ ప్రాతిపదికన మరో అడ్డుకట్ట నిర్మించారు.
పోలవరం కుడికాల్వ 114వ కి.మీ. వద్ద దీనిని నిర్మించారు. ఆదివారం ఉదయం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. సాయంత్రానికి అడ్డుకట్ట నిర్మాణం పూర్తి చేసి పోలవరం కుడి కాల్వ నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు కుడికాల్వలోకి రాకుండా ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు.
పాత మోటారుతో పక్కా మోసం
పట్టిసీమ ఎత్తిపోతలకు..హంద్రీనీవా పథకానికి చెందిన పాత మోటారు బిగించి ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. హంద్రీనీవా లిఫ్ట్‌కు ఆరేళ్లపాటు ఉపయోగించిన మోటారును తొలగించి పట్టిసీమ మొదటి పంపునకు బిగించింది. ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచింది. పైగా భోపాల్ నుంచి తీసుకువచ్చామని నమ్మబలికింది. అయితే, తెచ్చిన మోటారు పరిమాణం తక్కువగా ఉండటం.
కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా లిఫ్ట్ వద్ద ఆరో మోటారు హఠాత్తుగా కనిపించకపోవడంతో దానినే ఇక్కడకు తీసుకువచ్చి బిగించారన్న సంగతి బట్టబయలైంది. ఆ మోటారు కూడా తొలిరోజే మొరాయించింది. మరమ్మతులు చేసి ఆన్ చేశారు.
విచారణ జరిపి చర్యలు
పట్టిసీమ పనుల్లో ఏర్పడిన సమస్య ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో.. విచారణకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆదివారం అక్విడెక్ట్‌కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు.
- మంత్రి దేవినేని ఉమా