మరో 10 మోటార్ల తరలింపు? | Handri neeva From Pattiseema | Sakshi
Sakshi News home page

మరో 10 మోటార్ల తరలింపు?

Published Tue, Sep 22 2015 2:00 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

మరో 10 మోటార్ల తరలింపు? - Sakshi

మరో 10 మోటార్ల తరలింపు?

హంద్రీనీవా నుంచి పట్టిసీమకు పంపేందుకు యత్నాలు
కర్నూలు సిటీ/నందికొట్కూరు: హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మరో పది మోటార్లను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఒక మోటారును తరలించిన ప్రభుత్వం.. తాజాగా మరో పది మోటార్లను తరలించాలని అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధికారులు మాత్రం కేవలం ట్రయల్ రన్ కోసమే తరలిస్తున్నామని చెబుతుండడం గమనార్హం.

వాస్తవానికి హంద్రీనీవా పంపుల పనులు చేసిన సంస్థ.. పట్టిసీమ పనులు చేపట్టిన సంస్థ ఒకటే కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ కోసం ఆర్డర్ చేసిన పంపులు వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
 
ఒక్కో లిఫ్టు నుంచి రెండు మోటార్లు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన మోటార్లు సిద్ధం కాలేదు. దీంతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం-1 మల్యాల లిఫ్ట్ నుంచి 6వ మోటారును రాత్రికి రాత్రే తరలించి అమర్చింది. రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి ఈ పంపు ద్వారానే నీటిని విడుదల చేశారు. పట్టిసీమకు అమర్చాల్సిన 24 మోటార్లు ఇంకా సిద్ధం కాలేదు.

వీటి తయారీ ఆర్డర్‌ను బ్రెజిల్‌కు చెందిన ఓ కంపెనీకి ఇచ్చారు. అనుకున్న సమయానికి ఆ మోటార్లు రాలేదు. హంద్రీనీవాలో మొత్తం 8 లిఫ్టులు ఉండగా.. ఒక్కో లిఫ్టులో 12 మోటార్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లిఫ్టు నుంచి 2 మోటార్ల చొప్పున మొత్తం 5 లిఫ్టుల్లోని 10 మోటార్లను పట్టిసీమకు తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే, హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
 
సీమకు నీటి కష్టాలు తప్పవు
శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటిమట్టం ఉంటే హంద్రీనీవా ద్వారా నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. తాగునీటి అవసరాలకూ దీని ద్వారానే నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 841.4 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హంద్రీనీవాలో నీటి లిఫ్టింగ్ ప్రారంభమైంది. తాగునీటి అవసరాలకు 1,350 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పంపులను తరలిస్తే సీమ జిల్లాల్లో తాగునీరు, సాగునీటికి ఇబ్బం దులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ట్రయల్ రన్ కోసమే
పట్టిసీమలో ట్రయల్ రన్ కోసమే మోటార్‌ను తరలించినట్లు హంద్రీనీవా పర్యవేక్షక ఇంజనీర్ చెప్పారు. 2 ప్రాజెక్ట్‌లకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఒకటే కావడంతోనే తీసుకుపోయి ఉంటారని అన్నారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక తిరిగి తీసుకొస్తారని తెలిపారు.
 
సీమ ప్రజల నోట్లో మట్టికొట్టొద్దు
పట్టిసీమ పథకంతో రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం... ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పలు రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీమకు ప్రాణప్రదమైన హంద్రీనీవా మోటార్లను పట్టిసీమకు తరలించాలన్న యోచనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం దక్కకపోగా.. ప్రభుత్వం హంద్రీనీవా మోటార్ల తరలింపుతో సీమ ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పట్టిసీమ పథకానికి హంద్రీనీవా మోటారును రాత్రికి రాత్రే తరలించడాన్ని చూస్తే ప్రభుత్వం ఏ తరహాలో ప్రజలను మోసగిస్తోందో వెల్లడైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేస్తే ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు తెలపాల్సిన అవసరం లేదా? అని డీఈ శ్రీనివాస్‌నాయక్‌ను ప్రశ్నించారు.  హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ఐజయ్య పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement