పట్టిసీమకు గుట్టుగా 'పంప్' చేశారు
కర్నూలు: పట్టిసీమ సాక్షిగా చంద్రబాబు సర్కారు బండారం బయటపడింది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడానికి టీడీపీ ప్రభుత్వం చాటుగా సాగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ పీక్కెళ్లి పట్టిసీమకు అమర్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మల్యాల దగ్గర ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు ఆరో పంప్ ను ఈనెల 12న పట్టిసీమకు తరలించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. ఆరేళ్లుగా వాడిన పంప్ ను పట్టిసీమకు అమర్చి హడావుడిగా నీళ్లు విడుదల చేశారు. ఈనెల 18న పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్ కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్ ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ చేసి ఆర్భాటంగా ప్రారంభించారు.
ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం సంగతి అటుంచితే హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ ను గుట్టుగా తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.